కేసీఆర్‌, జగన్‌ది ఒకటే మాట, ఒకటే బాట – అందుకు అసెంబ్లీనే సాక్షి… నిజమేనా?

కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌… ప్రస్తుతం ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులు. వీరి మధ్య సఖ్యత ఉందనేది జగమెరిగిన సత్యం. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్న సమయంలో… వీరిద్దరూ పలు మార్లు కలుసుకున్నారు. విందులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. కేసీఆర్‌కు సర్జరీ అయిన తర్వాత.. జగన్‌ ఆయన ఇంటికి వచ్చి పలకరించి, పరామర్శించి వెళ్లారు కూడా. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే… ? ఇప్పుడు కూడా ఇద్దరూ ఒకే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. పవర్‌లో ఉన్నప్పుడే కాదు… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ ఒకే దారిలో పయనిస్తున్నారా..? అంటే అవుననే అనాల్సి వచ్చేలా ఉంది.

కేసీఆర్‌, జగన్‌… ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉంది. కానీ.. ఇద్దరి ఆలోచనలు ఒకేలా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు వారు తీసుకున్న నిర్ణయాలు, రచిస్తున్న వ్యూహాలు కూడా సేమ్‌ టు సేమ్‌ అన్నట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు.. అసెంబ్లీ సమావేశాల విషయం తీసుకుంటే. అధికారం కోల్పోయాక కేసీఆర్‌… అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంలేదు. గత ఏడాది బడ్జెట్‌ సమయంలో ఒక్కసారి సభకు వచ్చారు… ఆ తర్వాత తిరిగిమళ్లి కూడా చూడలేదు. కేసీఆర్‌ సభకు రావాలని.. ఆయన్ను గట్టిగా కార్నర్‌ చేయాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ ఉవ్విళ్లూరు తుంది. కానీ… వారికి కేసీఆర్‌ ఆ అవకాశం ఇవ్వడంలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణించిన సందర్భంగా.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అప్పుడు కూడా కేసీఆర్‌.. సభకు రాలేదు. ఇక… ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ వస్తారని.. కేటీఆర్‌ చెప్తున్నారు. అది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. ఒకవేళ వచ్చినా… బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు వచ్చి.. వెళ్లిపోతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఏపీలో వైఎస్‌ జగన్‌ తీరు కూడా కేసీఆర్‌ లానే ఉంది. అధికారం కోల్పోయాక జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానేలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని.. ప్రభుత్వంపై నెపం నెట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో ప్రజాసమస్యలపై ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందనేది ఆయన వాదన. ప్రతిపక్ష హోదానే ఇవ్వనప్పుడు సభకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు జగన్‌. అయితే.. జగన్‌ సభకు వస్తే.. గత ఐదేళ్ల పాలనపై ఆయన్ను కడిగిపారేయాలని కూటమి ప్రభుత్వం ఎదురుచూస్తోంది. వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే.. నిబంధనల ప్రకారం సభ్యత్వం రద్దవుతుందని కూడా చెప్పారు. ఆ తర్వాత… బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు.. సభకు వచ్చారు జగన్‌. సరిగ్గా 11 నిమిషాలు ఉండి.. వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. ఇలా… కేసీఆర్‌, జగన్‌.. ఇద్దరి తీరు ఒకేలా ఉంది. అసెంబ్లీలోకి వస్తే.. విపక్షంలో కూర్చునేందుకు వారు ఇష్టపడటం లేదు. అందుకే సభకు వెళ్లడంలేదని సమాచారం.

కేసీఆర్‌, జగన్‌ ఆలోచనలే కాదు… ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకేలా ఉంటున్నాయి. ఇద్దరూ ఎక్కడా రాజీపడరు. ఏది అనుకుంటే అదే చెప్తారు. మొండితనం కూడా ఇద్దరిలోనూ కనిపిస్తోంది. ప్రజల్లో తమకున్న బలంపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు.

Exit mobile version