
Trump On Hamas: హమాస్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ ను లేకుండా చేయాలని ఇజ్రాయెల్ కు సూచించారు. శాంతి చర్చలకు హమాస్ ఒప్పుకోవడం లేదన్న ఆయన, గాజాపై దాడులు ముమ్మరం చేయక తప్పదన్నారు. “హమాన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేదు. వాళ్లకు ప్రాణాలతో ఉండాలని ఇష్టం లేనట్టుంది. దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారి పని ముగించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు” అని ట్రంప్ వెల్లడించారు. హమాస్ బందీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుడు ఈడన్ అలెగ్జాండర్ విడిపించిన ట్రంప్.. హమాస్ దగ్గర ప్రస్తుతం బందీల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. చర్చలు జరుగుతున్న తరుణంలోనూ వాళ్లు కాల్పుల విరమణకు అంగీకరించడం లేదన్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని వారు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వారి పని పట్టాల్సిన అవసరం ఉందన్నారు.
శాంతి చర్చల నుంచి తప్పుకున్న అమెరికా
హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్యలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కీలక ప్రకటన చేశారు. హమాస్ తో చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. చర్చలు ముందుకు కొనసాగకపోవడానికి కారణం హమాస్ దే అని తేల్చి చెప్పారు. మరోవైపు హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ప్రకటించారు.
గాజాలో ఆకలి కేకలపై అంతర్జాతీయ సంస్థల ఆవేదన
అటు గాజాలో ఆకలి కేకలు కొనసాగుతున్నాయి. ఆహారం, ఔషధాల నిల్వలు అయిపోతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. గాజాను ఇప్పటికే ఇజ్రాయెల్ అన్ని వైపుల నుంచి చుట్టు ముట్టేసింది. గాజా వాసులకు మానవతా సాయం అందడం కూడా కష్టంగా మారిందని పలు సంస్థలు చెప్తున్నాయి. అయితే, తాము మానవతా సాయానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించట్లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి నిర్వహణ లోపాలే ఇందుకు కారణమని వెల్లడించింది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజాపై మరిన్ని దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది.
Read Also: థాయ్ లాండ్, కంబోడియా పరస్పర ఘర్షణలు, 12 మంది మృతి!