
Housing Scheme: తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు లేని కుటుంబాలకు ఆశాకిరణంగా మారిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన వెలువరించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఇప్పటివరకు తొలి విడతలో 4 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని, ఈ ఇళ్లలో ముఖ్యంగా పేదలు, ఒంటరి మహిళలు, పింఛను గ్రహీతలు, నిరుద్యోగులు వంటి వర్గాలకు ప్రాధాన్యత కల్పించామని వివరించారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి విడతకు సంబంధించి 1 లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలను నిర్వహించేలా చర్యలు వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఏప్రిల్ నుండి ప్రారంభించేందుకు ప్రభుత్వం పథకాలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఇళ్ల పంపిణీ ఒక సుదీర్ఘ నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఇల్లు అందించటం తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా భారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగనుందని ఆయన ప్రకటించారు. పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలూ తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశాన్ని పొందేందుకు ప్రభుత్వం జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ మోడల్‌లో అపార్ట్‌మెంట్ తరహా గృహ నిర్మాణాలు చేపట్టే యోచనలో ఉందని తెలిపారు. దీనితో అర్బన్ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నా.. ఎక్కువ కుటుంబాలు తక్కువ స్థలంలో ఇళ్లు పొందే విధంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇవి మూడు రకాల విభాగాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కాబడుతోందని, దీనివల్ల మధ్యవర్తుల జోక్యం పూర్తిగా లేకుండా, పారదర్శకంగా నిధులు చేరుతున్నాయని తెలిపారు.
పేదల జీవితాల్లో శాశ్వత భద్రత కలిగించే గృహ పథకాలు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యంగా తీసుకుంటుందని, గడిచిన సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగించాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రతి అర్హురాలికి, అర్హుడికి ఇల్లు అందించే బాధ్యతను ప్రభుత్వం శ్రద్ధగా నిర్వర్తిస్తుందని ఆయన చెప్పారు.
ALSO READ: IndiGo: ప్రయాణికులకు చుక్కలు.. మరో 400 విమానాల రద్దు





