
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు.
….. ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చు.
….. ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించవచ్చు.
….. బ్యాంకింగ్ చట్టాల బిల్లు సవరణతో అవకాశం.
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :-
బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.
గతంలో ఒక్క నామినీ కే అవకాశం !
గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతో పాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్ కి అవి జమ అయిపోతున్నాయి.
ఖాతాదారుకి రెండు ఆప్షన్లు !
నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్ లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్ లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.