
Friday Rituals: మన భారతీయ సంస్కృతిలో ఉప్పు అనేది కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు.. శరీర ఆరోగ్యం నుండి ఆధ్యాత్మిక పరిరక్షణ వరకు విశేష ప్రాధాన్యం కలిగినదిగా భావించబడింది. ముఖ్యంగా మన పెద్దలు ఉప్పును దృష్టి దోషాలను నివారించే శక్తిగా పరిగణించి పసిపిల్లల నుండి పెద్దల వరకూ ఎన్నో పరిహారాలలో ఉపయోగించి వచ్చారు. పసి పిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే అది దృష్టి దోషం కారణంగా జరిగిందని నమ్మకం. అలాంటి సందర్భాల్లో రాళ్ల ఉప్పును తీసుకుని దిష్టి తీస్తే పిల్లలు వెంటనే శాంతించి నిద్రపోతారని మనం ఎన్నోసార్లు చూశాం. ఈ విశ్వాసం గత శతాబ్దాల నుంచే ప్రాచుర్యంలో ఉంది.
స్త్రీలు బయటకు వెళ్లి, అలంకరించి వచ్చాక విపరీతమైన తలనొప్పి, అసహజమైన అలసట, మానసిక అసౌకర్యం అనుభవించడం మనం తరచూ వింటుంటాం. దీనిని కూడా దిష్టిగా పరిగణించి పెద్దలు వెంటనే ఉప్పుతో దిష్టి తీయించుకోవాలని సలహా ఇస్తారు. “నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది” అనే సామెత ఈ నమ్మకానికి ఒక బలం. పెద్దలు ఎప్పుడు కూడా అనవసరమైన దృష్టి దోషాలు దూరం చేసేందుకు ఉప్పుతో చేసే పూజలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
శుక్రవారం రాళ్ల ఉప్పుతో స్నానం చేయడం స్త్రీల ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి ఉపయోగకరమని చెబుతారు. స్నాన నీటిలో ఒక స్పూను రాళ్ల ఉప్పు కలిపి శరీరానికి రుద్దితే బాహ్య దృష్టి దోషాలు దూరమవుతాయని అన్నారు. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తగ్గి, మంచి శక్తి చుట్టూ వ్యాపిస్తుంది. ఈ ఆచారం భారతీయ గృహాల్లో వేల ఏళ్లుగా కొనసాగుతుంది.
ఉప్పు, శుక్రవారం సంబంధం కూడా చాలా ఆసక్తికరమైనది. మనకు వచ్చిన జీతంలో మొదటిసారిగా ఖర్చు చేసే డబ్బుతో శుక్రవారం రాళ్ల ఉప్పును కొనడం అత్యంత మంగళకరం అని విశ్వాసం. దీన్ని లక్ష్మీదేవి ప్రసన్నతకు చిహ్నంగా భావిస్తారు. ఇలా చేస్తే అప్పులు తగ్గి, ఆర్థిక స్తోమత పెరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అయితే మంగళవారం, శనివారం మాత్రం ఉప్పు కొనకూడదని పెద్దలు గట్టిగా చెబుతారు.
ఉప్పుతో చేసే దీపారాధన కూడా అద్భుతమైన శుభఫలాలను ఇస్తుందని నమ్మకం. ప్రతి శుక్రవారం ఇంట్లో వెలిగించే దీపం క్రింద రాళ్ల ఉప్పును పరచి దానిపై ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు. దీన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అష్టోత్తరం చదివితే ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. ఇలాంటి దీపం వెలిగించే ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివసిస్తుందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి.
ఉప్పుకు ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంటుంది. ఒకరి చేతి నుండి మరొకరు నేరుగా ఉప్పు తీసుకోవడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఇది కలహాలకు దారి తీస్తుందని నమ్మకం. అందువల్ల వీలైనంత వరకు ఉప్పును పాత్రలో పెట్టి అందుకోవాలి. అదేవిధంగా ఉప్పు పెట్టే డబ్బాలో ఒక రూపాయి నాణెం వేసిపెట్టడం సంపదకు ద్వారాలు తెరుస్తుందని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తారు. ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాలు పాటిస్తే ఇంట్లో శాంతి, సుఖం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పెద్దల అనుభవం చెబుతుంది.
ALSO READ: Vaishali: సర్పంచ్ బరిలో ట్రాన్స్‌జెండర్





