ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ దశతిరిగింది..!

దాసోజు శ్రవణ్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. చివరి వరకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేరు వినిపించింది… వినిపించడమే కాదు దాదాపు ఖరారు అన్న వార్తలు కూడా వచ్చాయి. కట్‌ చేస్తే… దాసోజు శ్రవణ్‌ కుమార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కేసీఆర్‌. దీంతో… దాసోజు శ్రవణ్‌ దశతిరిగినట్టు అయ్యింది. ఎందుకంటే… ఆయనకు ప్రజాప్రతినిధిగా ఇదే తొలి అవకాశం.

దాసోజు శ్రవణ్‌ సాఫ్ట్‌వేర్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న ఉద్యోగం వదిలేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌)లో చేరారు. ఏ కారణంతోనే ఏమో గానీ… గులాబీ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. కారు దిగి… హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌ తరపున ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ను ప్రకటించారు బీఆర్‌ఎస్‌ అధినేత. కానీ.. ఆనాటి గవర్నర్‌ తమిళిసై.. ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. హైకోర్టును ఆశ్రయించినా… ఈ విషయం ఎటూ తేలలేదు. దీంతో.. ప్రజాప్రతినిధిగా సేవలు అందించే అవకాశం ఆయనకు చేజారిపోయింది.

ఆ సమయంలో.. దాసోజు శ్రవణ్‌ కుమార్ ఐరెన్‌ లెగ్‌ అని…. ప్రచారం జరిగింది. ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోవడం… గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి చేతి వరకు వచ్చి చేజారిపోవడంతో ఆయనది బ్యాడ్‌ లక్‌ అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు… ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయబోతున్నారు దాసోజు శ్రవణ్‌ కుమార్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఎన్నిక కూడా లాంఛనం కానుంది. బీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి… కచ్చితంగా ఒక ఎమ్మెల్సీ వస్తుంది. కేసీఆర్‌ కూడా ఒక్క అభ్యర్థినే ప్రకటించడంతో… దాసోజు శ్రవణ్‌ ఎమ్మెల్సీ ఎంపికైనట్టే. పెద్దల సభలో అడుగుపెడుతున్నట్టే.

Exit mobile version