
Crow Revenge: మన భారతీయ సంస్కృతిలో పాములు పగబట్టడం, ఏనుగులు మనిషి ముఖాన్ని సంవత్సరాల తరబడి గుర్తుంచుకోవడం వంటి కథలు తరతరాలుగా వినిపిస్తూ వస్తాయి. ప్రాచీన శాస్త్రాలలో జంతువుల జ్ఞాపకశక్తి గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. కానీ మన దైనందిన జీవితంలో ప్రతిరోజూ చూస్తూ కూడా పెద్దగా పట్టించుకోని కాకుల గురించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక అద్భుతమైన నిజం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది తెలిసినా మరికొందరికి తెలియని విషయం ఏమిటంటే.. కాకులు అసాధారణమైన జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, గుంపుగా కలిసి వ్యవహరించే తెలివితేటలు కలిగిన పక్షులు. వీటిలో ఓపిక, నిర్ణయం, పగబట్టే స్వభావం కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అమెరికాలో జరిగిన తాజా పరిశోధనలో కాకులు తమకు కీడు చేసిన వ్యక్తిని 17 సంవత్సరాలపాటు కూడా మరువకపోవడం, అతడిని గుర్తించగానే అలర్ట్ అవడం, అరవడం, ఇతర కాకులకు కూడా ప్రమాద సంకేతాన్ని ఇవ్వడం వంటి ఆశ్చర్యకర లక్షణాలు బయటపడ్డాయి. ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరచిందేమిటంటే.. తమ జీవితకాలంలో ఎదురైన అనుభవాన్ని వీటి పిల్లలకు, జట్టులోని ఇతర కాకులకు చెబుతూ తరతరాలుగా పంపించేవని శాస్త్రపరమైన సాక్ష్యాలు వెల్లడించడం.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లఫ్ నేతృత్వంలోని పరిశోధక బృందం 2006లో ప్రత్యేకమైన ప్రయోగాన్ని ప్రారంభించింది. గోస్ట్ మాస్క్‌లు ధరించిన శాస్త్రవేత్తలు ఏడు కాకులను వలలో బంధించి, ఎలాంటి హాని చేయకుండా కొద్ది సమయంలోనే విడిచిపెట్టారు. విడిచిపెట్టే ముందు వాటి కాళ్లకు గుర్తించేందుకు చిన్న రింగులు కట్టారు. కొంతకాలం తర్వాత అదే మాస్క్‌లతో వారు యూనివర్సిటీ ప్రాంగణంలో తిరగగానే ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముందుగా బంధించిన కాకులే గట్టిగా అరవడం మొదలుపెట్టగా, కాలక్రమేణా అరుస్తున్న కాకుల సంఖ్య పెరుగుతూ దాదాపు 47కి చేరింది. అంటే అసలు బంధింపబడని లేక ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూడని కాకులు కూడా అదే మాస్క్ ఉన్న మనుషులను శత్రువుల్లా భావించడం ప్రారంభించాయి.
ఈ పరిస్థితిని విశ్లేషించిన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. కాకులు తమ శత్రువుల గురించి సమాచారాన్ని తమ పిల్లలకు, సన్నిహిత గుంపులకు వ్యాప్తి చేస్తాయి. తల్లికాకి అనుభవం నేరుగా పిల్లల ప్రవర్తనలోకి మారిపోవడం కాకులలో కనిపించే ప్రత్యేక పరిణామ ప్రక్రియ. కాకులు సాధారణంగా 20 సంవత్సరాలు జీవిస్తాయి. అందువల్ల ఒక కాకి తన జీవితంలో పొందిన అనుభవాన్ని తరతరాలకు పంపించి జ్ఞాపకాన్ని బలంగా నిలబెట్టగలదు.
ప్రాయశ్చిత్యం, పిండప్రదానం వంటి భారతీయ కర్మకాండల్లో కాకులకు ప్రత్యేక స్థానముండడం యాదృచ్ఛికం కాదు. చాలా మంది కాకులకు దివ్యదృష్టి ఉందని, ఆత్మలను కూడా స్పృశించగలవని భావిస్తారు. ఆధునిక శాస్త్రపరిశోధనలు కూడా కాకుల విశిష్టమైన మేధస్సును నిర్ధారించడం వల్ల పురాణాలలో చెప్పిన పక్షిదేవతల కథలు ఎంతగానో అర్ధవంతంగా కనిపిస్తాయి. ప్రకృతిలో అత్యంత తెలివైన పక్షుల్లో కాకులు కూడా ఒకటని, ఇవి భావోద్వేగాలు, అనుభవాలు, ప్రమాద సంకేతాలు, మానవ ముఖాలను గుర్తుంచుకునే శక్తి వంటి లక్షణాలలో మామూలు జంతువుల కంటే చాలా ముందున్నాయని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా మళ్ళీ స్పష్టం చేశారు.
ALSO READ: Rental Husband: మగవారిని అద్దెకు తెచ్చుకుంటున మహిళలు





