క్రైమ్సినిమా

Controversy: ప్రముఖ లేడీ సింగర్‌కి వేధింపులు

Controversy: పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Controversy: పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ బెంగాలీ నేపథ్య గాయని లగ్నజిత్ చక్రవర్తి భక్తి గీతం ఆలపించినందుకు వేధింపులకు గురయ్యానంటూ చేసిన ఆరోపణలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారితీశాయి. ఒక సాంస్కృతిక వేదికపై కళాకారిణి స్వేచ్ఛపై దాడి జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి.

తూర్పు మిడ్నాపూర్ జిల్లా భగవాన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లగ్నజిత్ చక్రవర్తి, దేవి చౌధురాణి చిత్రంలోని జోయ్ మా అంటూ సాగే ప్రసిద్ధ భక్తి గీతాన్ని ఆలపించారు. పాట ప్రారంభమైన కొద్దిసేపటికే వేదికపై ఉన్న ఉపాధ్యాయుడు మెహబూబ్ మల్లిక్ జోక్యం చేసుకుని పాటను ఆపాలని ఆదేశించినట్లు గాయని ఆరోపించారు.

భక్తి గీతం పాడొద్దని, దాని బదులుగా ఏదైనా లౌకిక లేదా సెక్యులర్ పాటను పాడాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు లగ్నజిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మల్లిక్ అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశాడని, తనను వేదికపైనే దూషించాడని ఆరోపించారు. ఇక్కడితో ఆగకుండా ఆ గందరగోళంలో తనను శారీరకంగా కూడా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది.

వేదికపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తాను మధ్యలోనే కార్యక్రమాన్ని విడిచిపెట్టానని లగ్నజిత్ తెలిపారు. కళాకారిణిగా తన ఆత్మగౌరవానికి తీవ్రంగా భంగం కలిగిందని, భక్తి గీతం పాడటం నేరంగా ఎలా మారుతుందో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నేరుగా భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా ప్రైవేట్ పాఠశాల యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, మొదట ఫిర్యాదు స్వీకరించడంలో సహకరించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిపై శాఖాపరమైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం స్కూల్ యజమానితో పాటు, దుర్బాషలాడిన ఉపాధ్యాయుడు మెహబూబ్ మల్లిక్‌పై కూడా విచారణ కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత గాయనికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అలాగే లగ్నజిత్‌కు అవసరమైన భద్రతను కూడా కల్పిస్తామని వెల్లడించారు.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. కళ, సంస్కృతి, భక్తి స్వేచ్ఛపై దాడిగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు తమ ఇష్టానుసారం ప్రదర్శన ఇవ్వడం ప్రజాస్వామ్య హక్కు అని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తూ తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి.

ALSO READ: తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలు.. ముహుర్తం ఫిక్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button