
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కాక రాజుకుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్న అశావాహులు లాబీయింగ్ ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చుట్టు కొందరు ప్రదిక్షణలు చేస్తుంటే.. మరికొందరు ఢిల్లీ పెద్దల దగ్గర తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్క సీటు బీఆర్ఎస్ గెలవనుంది. మిగితా నాలుగులో ఒకటి ఎంఐఎం సీటు కావడంతో తిరిగి వాళ్లకే ఇచ్చే అవకాశం ఉంది.
మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ తీవ్ర కసరత్తే చేస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డికి ఈ సారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్సీ కాకుంటేరాజ్యసభకు పరిశీలన చేసే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నీలం మధు ముదిరాజ్, సునీతా రావు, అనిల్ కుమార్ ,చరణ్ కౌశిక్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సంస్థాగత కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కాల వేణుగోపాల్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. అయితే మాదిగ వర్గానికి కేటాయించాలా.. మాల వర్గానికా అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌కు సీటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మరి కొందరు పార్టీ ముఖ్యులు తెరపైకి తెచ్చారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రేసులో ఉన్నారని తెలుస్తోంది.