క్రీడలు

బెంగళూరు తొక్కిసలాట రచ్చ, కొందరి అరెస్ట్, మరికొందరిపై వేటు!

Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 చనిపోయిన కేసులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్‌ ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సీఎం రాజకీయ కార్యదర్శికి ఉద్వాసన పలకగా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ పైనా బదిలీ వేటు పడింది. కోహ్లీపైనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

నాటకీయ పరిణామాల మధ్య నిఖిల్ అరెస్టు

ఆర్సీబీ మేనేజర్ నిఖిల్ అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆయన ముంబైకి వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి విమానాశ్రయానికి వెళ్లగా, అక్కడ అతడిని అరెస్టు చేశారు. అనంతరం నిఖిల్ తో పాటు అరెస్టు చేసిన మరో ముగ్గురు ఆర్సీబీ అధికారులను కోర్టుకు తరలించారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం నలుగురినీ పరప్పన అగ్రహార జైలుకు తీసుకెళ్లారు. అటు నిఖిల్‌ ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన భార్య మాళవిక కోర్టులో పిటిషన్‌ వేశారు. రెండేళ్ల చిన్నారితో కలిసి తాము ఎయిర్ పోర్టులో ఉండగా అరెస్టు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.  పోలీసులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య చెప్పారంటూ కనీస విచారణ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా తన భర్తను అరెస్టు చేశారని మండిపడ్డారు.  ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఆయనపై ఫిర్యాదు చేసిన పోలీసు అధికారే సస్పెండ్‌ అయ్యారని నిఖిల్ న్యాయవాది కోర్టుకు వివరించారు. అరెస్టు చట్టపరంగా లేదని వాదించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 9కి వాయిదా పడింది.

మరికొందరిపై కన్నడ సర్కారు వేటు

అటు ఈ తొక్కిసలాటకు బాధ్యులుగా భావించి కర్నాటక సర్కారు మరికొంత మందిపై వేటు వేసింది. ఈ ఘటనపై వెంటనే స్పందించలేదంటూ ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ హేమంత్‌ ని బదిలీ చేసింది. ఇప్పటికే బెంగళూరు సీపీ, ఏసీపీ, డీసీపీ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం రాజకీయ కార్యదర్శి గోవిందరాజు  ప్రొటోకాల్‌ పాటించలేదని, ముందస్తు చర్యలు తీసుకోలేదని  ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. మరోవైపు ఈఘటనపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Read Also: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీపై కేసు, సీపీపై వేటు, హైకోర్టు సీరియస్!

Back to top button