జాతీయం

Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్లకుగడువు తగదు, సుప్రీం కీలక తీర్పు!

రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెల్లడించింది.

రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్‌ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. అయితే, గవర్నర్‌ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని ధర్మాసనం అభిప్రాయ పడింది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది.

రాష్ట్రపతి న్యాయ సలహాలకు సుప్రీం సమాధానం

రాష్ట్రాల శాసన సభలు ఆమోదించి పంపించిన బిల్లులకు గవర్నర్‌ సమ్మతి తెలిపే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. సీజేఐ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రశేఖర్‌ సభ్యులుగా ఉన్న ధర్మానసం కీలక తీర్పు ప్రకటించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143వ నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ కేసు నేపథ్యం ఏంటంటే?

తమిళనాడుకు చెందిన పది బిల్లులను గవర్నర్‌ తొక్కిపట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్‌ 8న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాలు చేయకుండా మీకు ఆ అధికారాలు ఉన్నాయా చెప్పండంటూ సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా న్యాయ సలహా కోరింది. దీనికి సమాధానంగా సుప్రీం… రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే చర్యలు న్యాయస్థానాల పరిశీలనకు అతీతం కాదని చెబుతూనే రాజ్యాంగ అధినేతలకు బిల్లుల ఆమోదం కోసం గడువు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది.

రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు

గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకటి ఒక బిల్లు గవర్నర్‌ దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ పరిశీలించి సమ్మతి తెలియజేయడం, రెండు ఏదైనా సహేతుకమైన కారణం చెప్పి బిల్లును రిజర్వ్‌ లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, మూడు బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం. ఈ ఆప్షన్లు ఎంచుకోవడంలో రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్‌ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారని, అటువంటి సమయంలో న్యాయస్థానాలు గడువు విధించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయ పడింది.

Back to top button