సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన రీసెంట్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని, కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నానన్నారు. భారత్ తనకు స్ఫూర్తి, ఇల్లు అని, భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు రెహమాన్ ఒక వీడియో విడుదల చేశారు. దానికి తాను కంపోజ్ చేసిన ‘మా తుఝే సలాం.. వందేమాతరం’ గీతాల క్లిప్స్ ను యాడ్ చేశారు.
మత వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
‘‘సంగీతం అనేది ఎల్లప్పుడూ మన సంస్కృతిని అనుసంధానించేందుకు, వేడుక చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉంటుందని నేను విశ్వసిస్తాను. భారత్ నాకు స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తాను. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్నస్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం నాకు కల్పించింది. ఒక్కోసారి మన ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాను. కానీ, ఎప్పటికీ సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడమే నా లక్ష్యం. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని రెహమాన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇంతకీ రెహమాన్ ఏమన్నారంటే?
సినీరంగంలో మత వివక్ష ఉందని రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం ‘ఛావా’కు సంగీతం అందించిన రెహమాన్, ఆ చిత్రం గురించి, అలాగే బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. “ఛావా ఒక విభజనవాద చిత్రం. సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకొని ఈ సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నాను. కానీ, ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్ గురించి తీస్తున్న సినిమాకు పని చేయడం గౌరవంగా భావించి అంగీకరించాను. కానీ, ఈ సినిమాలో ‘సుభాన్ అల్లా, అల్హమ్దులిల్లా’ వంటి పదాలను ప్రతికూల సందర్భాల్లో వాడడం నాకు ఎబ్బెట్టుగా తోచింది. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో నాకు పెద్దగా పని దొరకడం లేదు. బహుశా దీనికి మతపరమైన కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరేవాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలున్నాయి” అన్నారు.





