
ఇళ్లలోనూ, తోటల్లోనూ ఎలుకలు, పందికొక్కుల సమస్య రోజు రోజుకూ ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్రాంతాల్లో, గోదాములు, వంటగదులు, స్టోర్‌రూమ్‌లలో ఇవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. బియ్యం, పప్పులు వంటి ఆహార పదార్థాలను పాడుచేయడమే కాదు.. బట్టలు, వైర్లు, ఫర్నిచర్‌ను కొరికేసి ఆర్థిక నష్టానికి కారణమవుతున్నాయి. చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు రసాయన మందులు, విషపదార్థాలు ఉపయోగిస్తుంటారు. అయితే అవి పెంపుడు జంతువులు, చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హాని లేకుండా ఎలుకలను తరిమేసే సహజ పరిష్కారాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన పరిష్కారాల్లో ముఖ్యమైనవి కొన్ని ప్రత్యేక మొక్కలు. కొన్ని రకాల మొక్కల నుంచి వెలువడే ఘాటైన వాసన ఎలుకలకు, పందికొక్కులకు అస్సలు నచ్చదు. ఆ వాసన తగిలిన ప్రాంతాలకు అవి రావడానికి భయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇళ్లలో లేదా తోటల్లో ఈ మొక్కలను పెంచితే ఎలుకల బెడదను చాలా వరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది పుదీనా మొక్క. పుదీనాలో ఉండే సహజ తైలాలు తీవ్ర వాసనను విడుదల చేస్తాయి. ఈ వాసన ఎలుకలకు అసహనంగా మారుతుంది. ఇంటి చుట్టూ, కిటికీల దగ్గర లేదా వంటగది పరిసరాల్లో పుదీనా కుండీలు ఉంచితే ఎలుకలు ఆ వైపు రావడం తగ్గుతుందని అనుభవాలు చెబుతున్నాయి. పుదీనా నూనెను దూదిపై వేసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
తర్వాత ముఖ్యమైనది వెల్లుల్లి మొక్క. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు గాఢమైన వాసనను వెదజల్లుతాయి. ముఖ్యంగా నేల కింద కన్నాలు వేసుకుని జీవించే పందికొక్కులకు ఈ వాసన తట్టుకోలేనిది. తోటలో లేదా ఇంటి చుట్టూ వెల్లుల్లి మొక్కలను పెంచితే అవి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లావెండర్ మొక్క కూడా ఎలుకలను దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనుషులకు ఆహ్లాదాన్ని ఇచ్చే లావెండర్ సువాసన, ఎలుకలకు మాత్రం తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది. తోటలో అక్కడక్కడా లావెండర్ మొక్కలను నాటడం వల్ల ఎలుకల రాకను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బంతి పూల మొక్కలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైనవే. అలంకరణ కోసం ఎక్కువగా పెంచే ఈ మొక్కలు, తెగుళ్లను, ఎలుకలను దూరంగా ఉంచే లక్షణం కలిగి ఉంటాయి. వీటి వేర్లు, ఆకుల నుంచి వచ్చే వాసన పందికొక్కులు దరిచేరకుండా అడ్డుకుంటుంది. అందుకే తోట అంచుల్లో బంతి మొక్కలను నాటాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
లెమన్ గ్రాస్ మరో ప్రభావవంతమైన మొక్క. దీనిలోని సిట్రోనెల్లా వాసన దోమలనే కాదు, ఎలుకలను కూడా తరిమేస్తుంది. తక్కువ నీటితోనే వేగంగా పెరిగే ఈ మొక్కను ఇంటి ముఖద్వారం దగ్గర లేదా తోట అంచుల్లో పెంచితే మంచి ఫలితం ఉంటుంది.
అయితే కేవలం మొక్కలు పెంచడమే సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను నిల్వ చేయకుండా తొలగించాలి. ఆహార వ్యర్థాలు బయట పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సహజ పద్ధతులను పాటిస్తే, ఎలాంటి రసాయనాలు వాడకుండానే ఎలుకల సమస్య నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.
ALSO READ: ఆహా అవిన్యా.. ఏముంది గురూ!.. టాటా నుంచి కళ్లు చెదిరే కారు





