
ఇండిగో కార్యకలాపాలలో ఏర్పడిన సంక్షోభం దేశవ్యాప్తంగా విమాన రవాణాను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వరుసగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికుల ఆందోళన మరింత ముదురుతోంది. అత్యవసర పనులు ఉన్న వారు, చికిత్స కోసం వెళ్లాల్సిన వారు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఎవరికైనా ఈ రద్దులు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో హరియాణాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక తండ్రి తన కొడుకును రక్షించడానికి చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రోహ్‌తక్ జిల్లాలోని మాయ్నా గ్రామానికి చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరి పంఘాల్ ప్రస్తుతం ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన ఆశీష్ డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ప్రీ-బోర్డ్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కానీ పరీక్షలకు ముందు రెండు రోజులకే కళాశాల అతనికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. షూటింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రదర్శన కనబరిచినందుకు కళాశాల యాజమాన్యం ఆశీష్ ప్రతిభను ప్రశంసించాలనుకుంది.
అందుకు హాజరు కావడానికి ఆశీష్ ఇప్పటికే ఢిల్లీ నుంచి ఇండోర్‌కు ఇండిగో విమానం బుక్ చేసుకున్నాడు. అతన్ని విమానాశ్రయానికి తీసుకెళ్లడానికి అతని తండ్రి రాజ్ నారాయణ్ పంఘాల్ స్వయంగా వచ్చారు. కానీ విమానాశ్రయానికి చేరుకున్న కొద్దిసేపటికే షాకింగ్ సమాచారం వచ్చింది. ఇండోర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు చేయబడింది. విమానం రద్దయిందన్న వార్త ఆశీష్ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఫలితంగా అతను కళాశాలలో జరగబోయే సన్మాన కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. ఇది మాత్రమే కాదు. రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ప్రీ-బోర్డ్ పరీక్షకు ఎలా వెళ్లాలి అనే భయం అదనంగా అలముకుంది.
ఈ పరిస్థితిలో రైలు టికెట్ దొరకడం చాలా కష్టమైన పని. దొరికినా రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం పరీక్షకు సిద్ధమవ్వడం అసాధ్యమే. ఇలాంటి సమయంలో తన కొడుకు భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదనే ఆందోళనతో రాజ్ నారాయణ్ ఒక దృఢ నిర్ణయం తీసుకున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా తన కుమారుడు పరీక్షను మిస్ కాకూడదని సంకల్పించారు.
తక్షణమే కారును స్టార్ట్ చేసి ఢిల్లీ నుండి ఇండోర్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. రెండు నగరాల మధ్య దూరం దాదాపు 800 కిలోమీటర్లు. రాత్రంతా విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడుపుతూ ఆయన సాగారు. పిల్లవాడి పరీక్ష ఆలోచన మాత్రమే తనకు ధైర్యాన్ని నింపిందని రాజ్ నారాయణ్ తెలిపారు. చివరకు మరుసటి రోజు ఉదయం, పరీక్ష ప్రారంభానికి కొద్దిసేపటి ముందే ఇండోర్‌కు చేరుకున్నారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఆశీష్ తన పరీక్షను రాయగలిగాడు. విమానం రద్దైనప్పటికీ తన కొడుకు విద్యను రక్షించేందుకు తండ్రి చేసిన త్యాగం, అతని అంకితభావం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.
ALSO READ: డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. సెల్ టవర్ ఎక్కిన ఓడిన సర్పంచ్ అభ్యర్థి భర్త





