పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలందరికీ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. గత సమావేశాల మాదిరిగా కాకుండా ఈ టీపార్టీకి విపక్ష ఎంపీలు కూడా హాజరయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సరదా ముచ్చట్లతో సభ్యులంతా సందడిగా గడిపారు.
ప్రధాని మోడీతో ప్రియాంక ముచ్చట్లు
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఓం బిర్లా, మోదీతో పాటు రాజ్‌నాథ్ సింగ్ కూర్చుని ఉండగా ఆయన పక్కన ప్రియాంక కూర్చున్నారు. తన నియోజకవర్గం వయనాడ్ నుంచి తెచ్చుకున్న ఒక మూలికను ఎలర్జీ రాకుండా తీసుకుంటూ ఉంటానని ప్రియాంక వివరించారట. మోడీ ఇటీవల జరిపిన ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన గురించి ప్రియాంక అడగగా, బాగా జరిగిందని ఆయన బదులిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సీపీ నేత సుప్రియా సులే, సీపీఐ నేత డి.రాజా కూడా సమావేశంలో పాల్గొన్నారు.
విపక్ష ఎంపీలతో ప్రధాని నవ్వులు
శీతాకాల సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించి ఉండాల్సిందని ధర్మేంద్ర యాదవ్ అభిప్రాయపడగా, ఆయనకు గొంతు నొప్పి రాకుండా ఇక్కడితో ముగించామని మోడీ సరదాగా బదులిచ్చారు. బాగా ప్రిపేర్ అయి సభకు వచ్చారంటూ ఎన్‌కే రామచంద్రన్ తదితర విపక్ష ఎంపీలను పీఎం అభినందించారు. పాత పార్లమెంటు భవనంలో మాదిరిగానే న్యూ పార్లమెంట్ బిల్డింగ్‌లో ఎంపీల కోసం ఒక సెంట్రల్ హాల్ చేర్చాలని పలువురు ఎంపీలు మోడీని కోరారు. సెంట్రల్ హాలులో ఎంపీలు, రిటైర్‌మెంట్ అయిన ఎంపీలు చర్చించుకునే వారు. దీనిపై మోడీ సరదాగా స్పందించారు. అది రిటైర్‌మెంట్ తర్వాత కదా…ఇంకా మీరు చాలా సేవ చేయాల్సి ఉంది.. అని అనడంతో సమావేశంలో నవ్వులు వెల్లివిరిసాయి. ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాల విషయంలోనూ స్పీకర్ సముచితంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయ పడ్డారని, స్పీకర్ టీపార్టీకి విపక్ష ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
This is the difference – @priyankagandhi understands the need for some courtesy calls – here at the speakers’ tea pic.twitter.com/zpS5c7OzDq
— pallavi ghosh (@_pallavighosh) December 19, 2025





