
నంద్యాల జిల్లాలోని నందమూరి నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చాకలి గుర్రప్ప అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా.. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భార్య పౌర్ణమి తన అల్లుడితో కలిసి భర్త గొంతు నులిమి హతమార్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నంద్యాల అదనపు ఎస్పీ ఎం.జావళి స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో భాగంగా మృతుడి భార్య పౌర్ణమిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న అల్లుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబంలో నెలకొన్న వివాదాలు, ఆస్తి తగాదాలే ఈ హత్యకు దారితీశాయా..? లేదా మరేదైనా కారణం ఉందా..? అన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ దారుణ ఘటనతో నందమూరి నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంటి గొడవలు చివరకు హత్య వరకు వెళ్లడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తు పూర్తవ్వాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Rape Case: అర్థరాత్రి యువతిని లాక్కెళ్లి అత్యాచారం.. ఆపై మరో ఘోరం





