
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : వల్లభనేని వంశీ ఎట్టకేలకు విడుదలయ్యారు. జైలు నుంచి అడుగు బయటపెట్టాడు. అయినా.. అతను వంశీనేనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అంతలా మారిపోయింది ఆయన రూపం. అసలే అనారోగ్యం.. ఆపై జైలు జీవితం ఇంకెలా ఉంటాడులే… అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిబ్రవరి 16న వల్లభనేని వంశీని హైదరాబాద్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఏపీ పోలీసులు. ఆ తర్వాత సత్యవర్థన్ కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణ.. ఇలా ఒకటా రెండా.. మొత్తం 11 కేసులు పెట్టారు. ఫిబ్రవరి 11 నుంచి జ్యుడీషియల్ రిమాండ్‌లోనే ఉన్నారు వంశీ. రోజులు దాటాయ్.. వారాలు గడిచాయ్.. నెలలు తిరిగాయ్. ఆయనకు ఊరట లభించలేదు. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ పడింది. ఇలా… నాలుగున్నర నెలలు.. అక్షరాల 137 రోజులు జైల్లో ఉండిపోయారు వల్లభనేని వంశీ. జైల్లో ఉండగానే అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటి నుంచి… గంభీరంగా ఉండే ఆయన మెత్తబడ్డారు. రూపురేఖలు మారిపోయాయి. ఇప్పటికి 11 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.. జైలు నుంచి బయటకు వచ్చారు.
విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన వంశీని చూసి.. ఆయన భార్య పంకజశ్రీ ఎమోషనల్ అయ్యారు. వంశీ చూసి కన్నీరు పెట్టుకున్నారు. వంశీ కోసం వైసీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో విజయవాడ సబ్ జైలు దగ్గరకు తరలివచ్చారు. వైసీపీ నేతలు పేర్నినాని, తలశిల రఘురాం, సింహాద్రి రమేష్, కైలే అనిల్, దేవభక్తుని చక్రవర్తి… ఇలా పలువురు నేతలు జైలు దగ్గరకు వచ్చి వంశీకి స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసంది నూజివీడు కోర్టు. దీంతో వంశీపై ఉన్న 11 కేసుల్లో బెయిల్ లభించినట్టైంది. ఈ క్రమంలో ఇవాళ వంశీ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే… అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం టెన్షన్ మొదలైంది. వంశీ బయటకు వస్తారా రారా అని ఆయన అభిమానులు కంగారు పడ్డారు. అయితే.. ముందస్తు బెయిల్ కొట్టేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. దీంతో… వంశీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఎట్టుకేలకు ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు.