గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేపట్టిన ఆపరేషన్ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల్లో నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తోంది హైడ్రా. పెద్ద పెద్ద భవంతులను సైతం అత్యాధునిక బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. హైడ్రా దూకుడుతో శనివారం వస్తుందంటేనే కబ్జాదారులు వణికిపోతున్నారు. బుల్డోజర్లు కనిపిస్తే హడలి పోతున్నారు.
హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తెలంగాణలో హైడ్రా వల్ల ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదన్నారు. అందరిలాగే తనకూ హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని.. తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని తెలిపారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్డు మీద పడేయడం అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు అని.. ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును తయారు చేశారని విమర్శించారు.
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. జీహెచ్ఎంసీ, బుద్ద భవన్ లు కూడా నాళాల పైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇళ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.