వర్మ.. ఇదేం ఖర్మ – నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ ట్రోల్స్‌ – అధిష్టానం స్పందించదా..?

టీడీపీ పిఠాపురం నేత వర్మను చూసి అయ్యో..! పాపం అంటున్నారు చాలా మంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం పిఠాపురం ఎమ్మెల్యే టికెట్‌ వదులకుని… ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా దక్కక ఆయన బాధలో ఉన్నారు. అది సరిపోదన్నట్టు… జనసేన నేతలు.. వర్మను టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు కూడా కోపం తెప్పించాయి.

ఎమ్మెల్సీ పదవి వచ్చిందని పట్టలేని ఆనందంలో ఉన్నట్టున్నారు నాగబాబు. జనసేన ఆవిర్భావ సభలో పట్టలేనంత సంతోషంగా కనిపించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై కౌంటర్లు వేశారు. వైఎస్‌ జగన్‌ నిద్రలో ఉన్నారని … కళ్లు మూసి తెరిచేలోపు నాలుగేళ్లు గడిచిపోతాయని… అప్పుడు తమదే అధికారమని కలవరిస్తున్నారని సెటైర్‌ వేశారు. ఆయన ఇంకో 20ఏళ్లు నిద్రలోనే ఉండాలని.. ఆయన్ను తాము అస్సలు డిస్టర్బ్‌ చేయమని ఎద్దేవా చేశారు. సరే.. వైసీపీ అంటే ప్రత్యర్థి పార్టీ… విమర్శలు చేసినా అర్థముంది. కానీ… టీడీపీ నేత వర్మను టార్గెట్‌ చేస్తూ.. పరోక్షంగా విమర్శలు చేశారు నాగబాబు. దీన్ని కొందరు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగబాబు తీరుపై మండిపడుతున్నారు.

పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ విజయానికి ఎవరో కారణం అనుకుంటే వారి ఖర్మ అని… పవన్‌ విజయం ఎన్నికల ముందే ఖాయమైపోయిందని చెప్పారాయన. పవన్‌ కళ్యాణ్‌ గెలుపునకు రెండు ఫ్యాక్టర్స్‌ పనిచేశాయని అన్నారు. ఒకటి పవన్‌ కళ్యాణ్‌, రెండు జనసేన శ్రేణులు అని చెప్పారు. తాము కూడా చేయాలి కాబట్టి.. పిఠాపురంలో ప్రచారం చేశామన్నారు. నాగబాబు అన్న ఈ వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించినవే అని.. ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు పవన్‌ గెలుపులో జనసేన పాత్ర తప్ప… కూటమిలోని టీడీపీ, బీజేపీ ఏమీ చేయలేదని కూడా నాగబాబు పరోక్ష విమర్శలు చేసినట్టు అయ్యింది.

Read More : ఆయనకు ఎవరైనా చెప్పండయా.. పవన్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

నాగబాబు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. కానీ… ఇంత వరకు ఆ పార్టీ నేతలు మాత్రం స్పందించలేదు. అంటే… వర్మపై నాగబాబు వ్యాఖ్యలను టీడీపీలోని పెద్దలు సమర్ధిస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వర్మ పార్టీలో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్న భావనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందా…? అదే నిజమైతే… ఇప్పుడు వర్మ భవిష్యత్‌ ఏంటి…? ఇది ఆయనే తేల్చుకోవాలి.

Exit mobile version