

– క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్
తుర్కయంజాల్, ఆగష్టు 9 క్రైమ్ మిర్రర్: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలోని స్థానిక వార్డు కార్యాలయం వద్ద మున్సిపల్, భవన నిర్మాణ కార్మికులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డి.కిషన్ మాట్లాడుతూ 1942 ఆగష్టు 9న దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు దేశానికి స్వాతంత్రం కావాలని క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారన్నారు.
కానీ నేడు మన పాలకులు ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ కార్మికులను, రైతులను కట్టుబానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చటం సిగ్గుచేటన్నారు. రైతుల నడ్డివిరిచేవిధంగా 3 నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ముందువరుసలో పనిచేసిన వారికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేసి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక, ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం తుర్కయంజాల్ మున్సిపల్ ఉపాధ్యక్షులు గుర్రం జంగయ్య, నర్సింహ, మున్సిపల్ కార్మికులు రవిచందర్, గోపాల్, ముత్యాలు, శివ, రాములు, స్వరూప, జానకమ్మ,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.