
- క్రమశిక్షణ, నిబద్ధతతో చదవాలి- ఎమ్మెల్యే అరూరి
- ఏకగ్రతతో చదివినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం- కలెక్టర్ గోపి
- ప్రణాళిక బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలి- కమిషనర్ ప్రావీణ్య
- పాజిటివ్ దృక్పధంతో ముందుకు వెళ్ళాలి- సీపీ తరుణ్ జోషి
- ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: దేశ చరిత్రలోనే మొదటిసారిగా భారీస్థాయిలో 80,039 ఉద్యోగ నియామకాలను రాష్ట్రప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 90 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పలు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జిల్లా కలెక్టర్ గోపి, వరంగల్ సీపీ తరుణ్ జోషి, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ కమిషనర్ ప్రావీణ్య, మామునూరు పీటీసీ ప్రిన్సిపల్ పూజ, పోలీస్ అధికారులు, అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగ సాధనలో ఉన్న నిరుద్యోగులు క్రమశిక్షణ, నిబద్దతతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని, మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆర్ధిక ఇబ్బందులు తనకు బాగా తెలుసని విద్యార్థులకు వివరించారు. చదువుకు పేదరికం ఎప్పుడు అడ్డు కాకూడదని పేర్కొన్నారు. అందుకోసమే అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ సాధనలో సఫలం కావాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ గోపి గారు మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏకగ్రతతో చదివితేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని తెలిపారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చక్కటి అవకాశాన్ని కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కమిషనర్ ప్రావీణ్య గారు మాట్లాడుతూ.. చదవడం అంటే కేవలం బుక్ లో ఉన్నది చదవడం కాదని, సబ్జెక్ట్ ను అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రణాళిక బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
సీపీ తరుణ్ జోషి గారు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి పాజిటివ్ దృక్పధంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఒక కచ్చితమైన గోల్ పెట్టుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, వాటిని అదిగమించినప్పుడే విజయాన్ని అందుకోగలమని సూచించారు.
అనంతరం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ సెక్రటరీ అరూరి విశాల్ మాట్లాడుతూ.. అభ్యర్థులను తన మాటలతో కాసేపు సరదాగా నవ్వించారు. నేను అనుభవంలో చాలా చిన్నవాడినని, కేజీఎఫ్ సినిమాకు గురువారం రాత్రే వెళ్లానని, సినిమాలు చూడడం వల్ల కాస్త మనసుకు ఆనందం వస్తుందని అన్నారు. సెకండ్ షోకు వెళ్లడంతో చాలా లేట్ అయిందని, ఉదయం లేచి ఉచిత కోచింగ్ ప్రారంభానికి వస్తానో.. రానో.. అంటూ బాధపడ్డానన్నారు. కానీ కేజీఎఫ్ కన్నా ఏజీఎఫ్ ముఖ్యమని హడావిడిగా లేచి వచ్చానని తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టనష్టాలు ఉంటాయని అన్నారు. మనం ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేప్పుడు అభ్యర్థులు కొన్ని రోజులు విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి ప్రైవేట్ విద్యాసంస్థల్లో కోచింగ్‌లు పొందలేని ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే వారికి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ (ఏజీఎఫ్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఒక శుభవార్త అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని పేద ప్రజలు, నిరుద్యోగ యువత, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రతిభ చూపేందుకు తన తండ్రి అరూరి రమేష్, తన తాత గట్టుమల్లు జ్ఞాపకార్థం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు కోచింగ్ తరగతులు నిర్వహించామన్నారు.
మేము కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రభుత్వ ఉద్యోగంలో ఫెయిల్యూర్ అనే భయాన్ని అధిగమించడం, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్, గ్రూప్-II పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులు, నిపుణులైన ఉపాధ్యాయులతో ఉచిత కోచింగ్ అందించామన్నారు. శిబిరంలో మొత్తం అభ్యర్థులకు సంస్థ ఉచిత భోజనాన్ని కూడా అందిస్తుందని, ఫౌండేషన్ స్టడీ మెటీరియల్స్‌ను కూడా అందజేస్తుందని తెలిపారు. కోచింగ్ కోసం అయ్యే ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని విశాల్ అన్నారు. ఈ సంవత్సరం మా యువకులు ఉద్యోగాలను చేజిక్కించుకునేలా కృషి చేస్తామని అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ సెక్రటరీ అరూరి విశాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..