
క్రైమ్ మిర్రర్, వరంగల్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళీ దంపతుల స్టోరీ సినిమా వివాదాస్పదమవుతోంది. వర్మ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసలు సినిమాలో రాంగోపాల్ వర్మ ఏం చెప్పారు? కొండా దంపతులను హీరోగా చిత్రీకరించారా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టార్గెట్ అయ్యారా అన్న చర్చ సాగుతోంది. వరంగల్ లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ను అడ్డుకునేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించారన్న వార్తలు రావడంతో… సినిమాలో ఆయనకు వ్యతిరేకంగా సీన్లు ఉన్నాయనే చర్చ సాగుతోంది. దీంతో సినిమాపై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది.
కొండా మురళి, కొండా సురేఖది లవ్ మ్యారేజీ. బలమైన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్‌లో పైకి ఎదిగిన నాయకులు. కొండా సురేఖ పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్‌లోనే సుదీర్ఘ రాజకీయం నెరిపారు. వైఎస్సార్ కు ముఖ్య అనుచరులుగా ఉండేవారు. ఆ తర్వాత జగన్ దగ్గరకు చేరారు. టీఆర్ఎస్పై రాళ్లదాడి చేసి.. ఆ కారు గుర్తు మీదనే గెలిచిన ఘనులు. కేసీఆర్‌తో చెడి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరి.. ప్రస్తుతం రాజకీయ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి పొలిటికల్‌గా లేచి పడిన కొండా హిస్టరీ.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మను ఆకర్షించింది. అయితే, ఆయన్ను అంత అట్రాక్ట్ చేసింది వాళ్ల పొలిటికల్ కెరీర్ మాత్రం కాదు. అంతకుమించి నడిచిన వాళ్ల లవ్ స్టోరీ. నక్సల్స్ తూటాలను తన శరీరంలో దింపుకొని.. ఆ నక్సల్ అగ్రనేత ఆర్కేతో మురళి నడిపిన డీల్. సర్పంచ్ నుంచి వరంగల్ జిల్లాను ఏలేంతగా ఎదిగిన కొండా ప్రస్థానం. ఆ హీరో టైప్ రౌడీ పాలిటిక్సే ఆర్జీవీని ఆకర్షించాయి. కొండా టైటిల్‌తో కాక పుట్టించి కేక పెట్టించే సినిమా తీసేశారు. ట్రైలర్‌తో రచ్చ రాజేశారు. ఇంతకీ కొండా.. చరిత్రలో ఏముంది? కొండా మురళి హీరోనా? విలనా? వరంగల్ ఏమంటోంది..?
కొండా మురళీ.. కొండా సురేఖ.. వరంగల్ ఎల్బీ కళాశాలలో బీఏ చదువుతుండగా వారి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. మురళీ కాపు.. సురేఖ పద్మశాలి.. కులాలు వేరైనా.. ప్రేమ-పెళ్లి జరిగిపోయింది. 1987లో డిగ్రీ కంప్లీట్ కాగానే.. తన స్వగ్రామం వంచనగిరిలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు కొండా మురళి. ఆ సమయంలో ఊరి కూడలిలో కుక్కను కాల్చి చంపి.. తనపై ఎవరైనా పోటీ చేస్తే.. ఈ కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తానని బెదిరించారనే ప్రచారం ఉంది. అలా 24 ఏళ్ల వయస్సులో సర్పంచ్ అయ్యారు కొండా మురళి. మొదట్లో వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అనుచరుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయనతో విభేదాలు వచ్చి.. కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎర్రబెల్లి, కొండాల మధ్య తీవ్రమైన రాజకీయ వార్ నడుస్తోంది.
కొండా మురళిపై కాస్త రౌడీ ఇమేజ్ ఉండటంతో.. సాఫ్ట్ ఫేస్‌గా తన భార్య కొండా సురేఖను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా వరంగల్ జిల్లాలో కొండా మురళిదే హవా. ఆయన కనుసన్నల్లో నడిచేది ప్రభుత్వ యంత్రాంగంవరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లలో తరుచూ కొండా పేరు వినబడేది. నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా ఆయనతో సంబంధాలు ఉన్నాయంటూ కొండా పేరు బయటకు వచ్చింది. తన చేతిలో అధికారం ఉన్నప్పుడు.. తన బద్దశత్రువైన టీడీపీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావును అణగదొక్కే ప్రయత్నాలు చేసేవారు. అదే, టీడీపీ పవర్లోకి వస్తే.. కొండాను అణిచేసేలా ఎర్రబెల్లి అడుగులు వేసేవారు. ఇలా వీరి మధ్య దశాబ్దాల వైరం. కొండా మూవీలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రోల్‌ను నల్లబల్లి సుధాకర్‌గా నెగటివ్ షేడ్‌లో చూపించినట్టు తెలుస్తోంది. ఒక అమ్మకు, నాన్నకు పుట్టినవాడినంటూ.. అనే డైలాగ్ ఎర్రబెల్లి క్యారెక్టర్ చేత చెప్పించడంతో కాంట్రవర్సీ పీక్స్‌కు చేరింది.
కొండా మురళి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్లో సాగింది. ఇద్దరివీ వేరు వేరు నియోజకవర్గాలు. రాజకీయాల్లో ఎర్రబెల్లిది క్లీన్ ఇమేజ్. కొండా మురళిది మాత్రం డిఫరెంట్ యాంగిల్. కట్ చేస్తే.. తన భర్తను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హత్య చేయించడానికి కుట్ర చేస్తున్నాడంటూ, తన మాంగళ్యం కాపాడాలంటూ.. నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే సురేఖ అప్పటి సీఎం చంద్రబాబును వేడుకోవడం సినిమాటిక్‌గానే ఉంటుంది. కొండా చరిత్ర ఖతర్నాక్‌గా ఉంటుంది, హత్యలు, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు లాంటి 19 కేసుల్లో నిందితుడిగా ఉండి, కోర్టు విచారణలో అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటికొచ్చారు కొండా మురళి. 2002 ఏప్రిల్‌లో అప్పటి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, డైనమిక్ లీడర్, కొండాకు కొరుకుడుపడని నాయకుడైన.. కొల్లి ప్రతాప్‌రెడ్డి వెళుతున్న కారుపై సడెన్‌గా అటాక్ జరిగింది. రాయలసీమకు చెందిన కిరాయి రౌడీలు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై కొల్లి ప్రతాప్‌రెడ్డిని చంపేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఆ మర్డర్ కొండా మురళి చేయించిందే.. అని ఆ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. అప్పటి వరంగల్ ఎస్పీ నళిన్ ప్రభాత్.. కొండా మురళికి బేడీలు వేసి.. చొక్కా విప్పించి.. హనుమకొండ చౌరస్తాలో, ఆయన స్వగ్రామమైన వంచనగిరిలో.. పరేడ్ చేయించిన సీన్ వరంగల్‌వాసులకు ఇప్పటికీ గుర్తే. సినిమాటిక్‌గా సాగిన ఆ సీన్ ఆర్జీవీ తీయబోయే మూవీలో ఉంటుందా? ఉండదా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
2003లో పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి ఆర్కేతో సంబంధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై కొండా మురళి–సురేఖలపై ‘పోటా’ కేసు నమోదుకావడం సంచలనం. ఆర్కేకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను కొండా మురళి సమకూర్చాడని.. అందుకు ప్రతిఫలంగా ఎర్రబెల్లిని నక్సల్స్ చంపాలని.. ఆర్కే-కొండా మధ్య డీల్ కుదిరిందని పోలీసులు ప్రకటించడం అప్పట్లో షాకింగ్ న్యూస్. ఆ కేసుకు పోలీసులపై ఎర్రబెల్లి ఒత్తిడే కారణమనేది కొండా ఆరోపణ. PWGపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లో.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నక్సలైట్ జిలానీబేగంను తన వాహనంలో ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్డించి పంపించడం.. కొండా మురళికి నక్సల్స్ మధ్య ఉన్న రిలేషన్‌కు ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు. 2009లో వైఎస్ రెండోసారి సీఎం అయినప్పుడు.. సురేఖ మంత్రి కావడం, వైఎస్ మరణానంతరం జగన్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరడం ఆసక్తికరం. జగన్ దగ్గర వివిధ పెట్టుబడుల రూపంలో వందల కోట్ల సొమ్ము ఇరుక్కుపోయిందని.. ఆ డబ్బు కోసమే జగన్ వెంట ఉన్నారని.. జగన్‌ను అడిగి అడిగి విసిగి వేసారి.. ఇక ఆ డబ్బులు రావని తెలిసి.. జగన్‌ను వదిలేసి టీఆర్ఎస్లో చేరారని అంటారు. భారతి సిమెంట్‌లో పెట్టిన ఆ 2 వందల కోట్ల పెట్టుబడుల విషయం గురించి జిల్లాలో ఇప్పటికీ మాట్లాడుకుంటారు.
వరంగల్ జిల్లా రక్తచరిత్రలో మురళి పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. అప్పట్లో నక్సల్స్.. కొండా మురళిని చంపేందుకు ఆయనపై తుపాకులతో ఫైరింగ్ చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో ఉన్న మురళిని ఆ నక్సల్స్ తూటాలు ఏమీ చేయలేకపోయాయి. అంతలోనే మురళి తేరుకొని.. ఓ నక్సల్స్ నుంచి తుపాకీ లాక్కొని ఎదురుదాడి చేయడంతో అన్నలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ కాల్పుల్లో ఆయన తలలోకి ఓ తూటా ముక్క దూసుకెళ్లగా.. అది ఇప్పటికీ కొండా మురళీ తలలో అలానే ఉంది. దానితో ఏం ప్రమాదం లేదని వైద్యులు అలానే ఉంచేశారు. ఆ దాడిలో ఆయన ఓ కన్ను కోల్పోగా.. ప్రస్తుతం ఉన్నది గాజు కన్ను అని అంటారు. కొండా మురళి జీవితంలో ఇంతటి ఖతర్నాక్ సీన్స్ ఉంటే.. ఆర్జీవీ దృష్టిలో పడకుండా ఎలా ఉంటారు? ట్రైలర్లోనూ కొండాపై కాల్పుల సీన్ ఉంది.
అయితే, కొండా లైఫ్‌లో ఎన్ని పాజిటివ్ షేడ్స్ ఉంటాయో అంతకుమించి నెగటివ్ రోల్ కనిపిస్తుంది. మరి, ఆర్జీవీ ఈ మంచి-చెడులను బ్యాలెన్స్ చేస్తారా? తనదైన స్టైల్లో విలనిజం, హీరోయిజం మిక్స్ చేసి చూపిస్తారా? చూడాలి మరీ..
ఇవి కూడా చదవండి ..
- ప్రియుడిని కిడ్నాప్ చేయించి పెళ్లి చేసుకున్న యువతి!
- రింగో… ‘రింగ్’….! షాద్ నగర్ లో మద్యం వ్యాపారుల సిండికేట్
- అక్రమ కట్టడాల కూల్చివేతపై జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
- ల* కొడకా… జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు