

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం లో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు. రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని తెలిపారు.
టిటిడిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి …
- వైఎస్ వివేకాను ఇంత కిరాతకంగా చంపారా..! డ్రైవర్ దస్తగిరి స్టేట్ మెంట్స్ లో సంచలనాలు..
- ఈటల కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకున్నారా?
- ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ? టీఆర్ఎస్ కు షాక్ తప్పదా..
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయనే సీఎం! లేటెస్ట్ సర్వేతో పార్టీల్లో కలవరం..