

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ కాక రాజేసింది. ఐదు నెలల పాటు తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ చుట్టే తిరిగాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా బైపోల్ కేంద్రంగానే సాగాయి. పార్టీల మధ్య ఉప సమరం మంటలు పుట్టించింది. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలో అధికార పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చి… బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన విజయం సాధించారు. హుజురాబాద్ హీట్ ఇంకా పూర్తిగా చల్లారకముందే తెలంగాణలో మరో ఉప సమరం రాబోతుందని తెలుస్తోంది. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగడం ఖాయమంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కోమటిరెడ్డి దాదాపు ఏడాదికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని భవిష్యత్తంతా బీజేపీదే అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు కూడా సాగించారు. దీంతో అప్పుడే ఆయన కమలం గూటికి చేరతారని భావించారు. కాని ఎందుకో ఆగిపోయింది. అయితే త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.
హుజురాబాద్ విజయంతో జోష్ మీదున్న బీజేపీ నేతలు కోమటిరెడ్డి బీజేపీలో చేర్చుకుని ఎంఎల్ఏగా రాజీనామా చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. కమలనాదుల వ్యూహం వర్కవుటైతే కోమటిరెడ్డి తొందరలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఒకవేళ మునుగోడులో ఉపఎన్నిక వస్తే తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే కోమటిరెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారట. డిసెంబర్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి పెళ్లి జరగనుంది. ఆ వివాహం తర్వాత మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనుచరులు కూడా చెబుతున్నారు. బీజేపీలో చేరడానికి, ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి కూడా తన కేడర్ కు సంకేతం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ఇక సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్నారు. రమేష్ కు జర్మనీ పౌరసత్వ వివాదం కోర్టులో నడుస్తోంది. రమేష్ జర్మనీ పౌరుడే అని ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు తేల్చింది. అయితే ఏదో సాంకేతిక కారణాలను పట్టుకుని రమేష్ తన కేసును కోర్టులో ఇంకా లాగుతున్నారు. ఎంత లాగినా ఏదోరోజు రమేష్ పై అనర్హత వేటుపడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. తొందరలోనే వేములవాడ స్ధానానికి ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందని కేంద్రం పెద్దల నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్నల్స్ వచ్చాయంటున్నారు. హుజురాబాద్ ఫలితం తర్వాత ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇదే కామెంట్ చేశారు. అంతేకాదు మునుగోడు, వేములవాడలో గెలిచేలా కమలనాధులు కసరత్తు కూడా మొదలు పెట్టేశారని సమాచారం. కమలనాథులు అనుకుంటున్నది అనుకున్నట్లు జరిగితే తొందరలోనే మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు! డిక్లేర్ చేసిన విశాఖ నేత..
- ఉద్యమ వీరులకా.. వలస నేతలకా? ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో?
- కవితకు ఎమ్మెల్సీ లేనట్టేనా? కేటీఆర్ తో గొడవలే కారణమా?
- కేసీఆర్ డబ్బులను కిషన్ రెడ్డి తరలించారా?
2 Comments