Telangana

అవమానమే.. అదృష్టం కాబోతోందా! కర్నెకు ఎమ్మెల్సీ ఖాయమైందా?

ఓటమి గెలుపునకు నాంది అంటారు.. అవమానాలే తర్వాత అదృష్టంగా మారుతాయని అంటారు. తెలంగాణ ఉద్యమకారుడి విషయంలోనూ ఇది నిజం కాబోతోందని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగి, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ ఉద్యమ నేత… ఇటీవల కాలంలో కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని, కేసీఆర్ కు దూరమయ్యారనే చర్చ ఉంది. రోజూ టీవీ ఛానెల్లలో టీఆర్ఎస్ గొంతుగా కనిపించే ఆ నేత కొన్ని రోజుల పాటు ఎక్కడా కనిపించకపోవడంతో.. ఆయనను హైకమాండ్ దూరం పెట్టిందనే వాదన బలంగా జరిగింది. ఆ నేతకు తెలంగాణ భవన్ లోనూ ఇటీవల అవమానం జరిగింది. 20 ఏండ్లుగా తెలంగాణ భవన్ కు వెళుతున్న ఆ నాయకుడిని.. లోపలికి అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది అడ్డుకోవడం కలకలం రేపింది. ఉద్యమ నేతకు అవమానం జరిగిందంటూ తెలంగాణ వాదుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అయితే అ నేతకు ఇప్పుడు అదృష్టం వరించబోతుందని తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో జరిగిన ఘటనే.. ఆయనకు ఇప్పుడు వరంగా మారిందని, ఇక రాదనుకున్న పదవి వచ్చేలా చేస్తుందని గులాబీ పార్టీలోనే చర్చ జరుగుతోంది.

క‌ర్నె ప్ర‌భాక‌ర్‌. టీఆర్ఎస్ మౌత్‌పీస్‌. మాజీ ఎమ్మెల్సీ. మీడియాలో పార్టీ వాయిస్‌ను గ‌ట్టిగా వినిపించే లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టే పార్టీ స్పోక్ ప‌ర్స‌న్‌. అలాంటి క‌ర్నె గొంతు ఇటీవల కొన్నాళ్లు మూగ‌బోయింది. పార్టీ స‌మావేశాల్లో కానీ, మీడియా చ‌ర్చ‌ల్లో కానీ ప్ర‌భాక‌ర్ క‌నిపించ లేదు..వినిపించ‌ లేదు. ఇదిలా ఉండగనే టీఆర్ఎస్ ప్లీనరీకి ముందు క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో తీవ్ర అవ‌మానం జ‌రిగింది. తెలంగాణ భవన్ గేటు దగ్గర కర్నెను పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌నకు టీఆర్ఎస్ భ‌వ‌న్‌లోకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అదేంటి.. తాను టీఆర్ఎస్ ప్లీనరీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్నానంటూ కర్నె ప్రభాకర్ పోలీసుల‌తో చెప్పిన ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆహ్వానితుల జాబితాలో క‌ర్నె పేరు లేదంటూ పోలీల‌సులు ఆయ‌న్ను తిప్పిపంపించేశారు.

ఇది అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌నా? లేక‌, నిజంగానే క‌ర్నెను పార్టీ ఆఫీసులోకి రానీయ‌కుండా అడ్డుకున్నారా? అనే చ‌ర్చ‌ జ‌రిగింది. కర్నె ప్రభాకర్ కు అవమానం జరిగిందనే వార్త కలకలం రేపింది. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉద్యమ నేతలకు గౌరవం లేకుండా పోయిందని, స్థానం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నెకు జరిగిన ఘటనతో ఉద్యమకారులను కావాలనే అవమానిస్తున్నారనే టాక్ కూడా వచ్చింది. కర్నెకు మద్దతుగా ఉద్యమకారులు గట్టిగా మాట్లాడారు. దీంతో టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది. ఈ ఘటన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కర్నెను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు మంత్రి కేటీఆర్. అంతేకాదు ప్లీనరీ ఏర్పాట్లలో మరింత ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఘటనతో ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత రావడం వల్లే కేటీఆర్ అలా చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కర్నె ప్రభాకర్ పేరు తెరపైకి వస్తోంది. గత సంవత్సం కర్నె ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసింది. ఆయనకు తిరిగి రెన్యూవల్ వస్తుందని భావించినా రాలేదు. ఆ సమయంలోనే కేసీఆర్ .. కర్నె ప్రభాకర్ ను దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. కర్నె కూడా మీడియాకు దూరంగా ఉండటంతో అది నిజమేనని అనుకున్నారు. ప్రభాకర్ కు తిరిగి ఎమ్మెల్సీ పదవి రాదనే చర్చ కూడా సాగింది. ఎమ్మెల్సీ పదవిపై కర్నె కూడా ఆశలు వదిలేసుకున్నారని ఆయన అనుచరులు కూడా భావించారు. అయితే తెలంగాణ భవన్ లో జరిగిన ఘటనతో ఉద్యమకారులకు పార్టీలో ప్రాధానత్య లేదనే సంకేతం జనాల్లోకి వెళ్లిందనే భయం గులాబీ పార్టీలో ఉంది. ఇది పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారట.

అందుకే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్న, ఎన్నోసార్లు జైలుకు వెళ్లిన కర్నె ప్రభాకర్ కు మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఉద్యమకారులను విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కర్నెకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తే.. ఆ ప్రచారానికి చెక్ పెట్టినట్లు అవుతుందని కూడా టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ భవన్ లో జరిగిన అవమానమే.. రాదనుకున్న ఎమ్మెల్సీ పదవి కర్నెకు వచ్చేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.