

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. గత ఎన్నికలో మెరుగైన రీతిలో ఓట్లు సాధించుకున్న హస్తం పార్టీ.. ఈ సారి అతితక్కువ ఓట్లకే పరిమితమవడం కలకలం రేపుతోంది. పార్టీ కోసం బలంగా వాయిస్ వినిపిస్తున్న యువజన నాయకుడు వెంకట్‌ను అభ్యర్థిగా నిలిపినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చివర్లో ప్రచారం చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండంటూ రేవంత్ చేసిన విజ్ఞప్తిని హుజురాబాద్ వాసులు అస్సలు పట్టించుకున్నట్టు లేదు. అందుకే, కాంగ్రెస్‌కు గతంలో ఎప్పుడు లేనంత తక్కువగా ఓట్లు వచ్చాయి. హుజురాబాద్ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడమే కాదు.. కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోటీ మేరక్ గుర్తుతో పోటీ పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి 60వేలకు పైగా ఓట్లు సాధించగా.. ఈసారి 4 వేల ఓట్లు కూడా రాలేదు. ఇదే ఇప్పుడు గాంధీభవన్ లో మంటలు రాజేస్తోంది.
ఇదే అదనుగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వేలెత్తి చూపుతున్నారు కాంగ్రెస్‌లోని కొందరు.హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్‌ను బలి పశువును చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వెంకట్‌ను అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇద్దరూ కలిసి నిర్ణయించారన్నారు. ఒకవేళ హుజురాబాద్‌లో డిపాజిట్ వచ్చి ఉంటే రేవంత్ రెడ్డి చరిష్మా వల్ల వచ్చింది అనేవారన్నారు. ఇప్పుడు మేము ఎవరు వెళ్లక పోవడం వల్లే డిపాజిట్ కూడా రాలేదని రేవంత్ అభిమానులు అంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
రేవంత్‌కు రెబల్‌గా మారిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హుజురాబాద్ ఓటమికి రేవంత్‌రెడ్డినే కారణమంటూ కార్నర్ చేశారు. ‘ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ నుంచి ఒక్క సభ కూడా పెట్టలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదు. కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో గట్టి క్యాడర్ ఉంది. అయినా తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదు. హుజూరాబాద్‌పై వాస్తవ పరిస్థితి ని హైకమాండ్ కు వివరిస్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దు’ అంటూ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
అటు మరో సీనియర్ నేత, రేవంత్‌తో సఖ్యతగా ఉండే పొన్నం ప్రభాకర్ సైతం హుజురాబాద్ ఓటమిపై స్పందించారు. ‘కాంగ్రెస్ ఓటమి ఊహించిందే. ఉత్తమ్ పీసీసీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారు. అది పార్టీకి నష్టం చేసింది. రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు.’ అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇలా హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై అప్పుడే లుకలుకలు బయలుదేరడం.. అవన్నీ రేవంత్‌రెడ్డి వైపే గురిపెట్టడం చూస్తుంటే.. హస్తం నేతల తీరు అసలేమాత్రం మారలేదనే మాట వినిపిస్తోంది.