

క్రైమ్ మిర్రర్, తాండూరు : తరచూ భార్యతో గొడవ పడుతున్న పాలమూరు కూలీ దారుణ హత్యకు గురైనాడు. భర్తతో సంసారం సాఫీగా సాగడం లేదని భావించిన సదరు కూలీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడుతో కలిసి అతన్ని కడ తేర్చింది. శవాన్ని కందనెల్లి వాగులో పారవేశారు. ఈ హత్యలో నిందితురాలు తమ్ముడు పాత్ర కూడా ఉందని, తమదైన శైలిలో కేసు దర్యాప్తు చేపట్టగా నిజాలు వెలుగులోకి వచ్చాయని తాండూర్ రూరల్ సీఐ జలేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిఐ కేసుకు సంబందించిన వివరాలను వెల్లడిoచారు.
వనపర్తి ప్రాంతానికి చెందిన అంజప్ప (35) కొంతకాలంగా తాండూర్ పట్టణంలో హమాలీగా పని చేస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన భార్య సుజాతతో కలిసి కాపురం పెట్టినా తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త చేష్టలు భరించలేక సుజాత తరచూ తన సోదరుడు కోమార్ శ్రీనివాస్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా కొద్ధి రోజుల క్రితం రాముగౌడ్ అనే వ్యక్తితో సుజాతకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. బావ అంజప్ప నుంచి తన అక్కను కాపాడాలని రాముగౌడ్ ను కోమార్ శ్రీనివాస్ కోరాడు.
చివరికి అంజప్పను హత మార్చాలని సుజాత, రాము, శ్రీనివాస్ పథకం రచించారు. ఈనెల 10న మద్యం మత్తులో వచ్చిన అంజప్పను ముగ్గురు కలిసి గొంతు, వృషణలను పిసికి హతమార్చారు. అనంతరం శవాన్ని కందనెల్లి వాగులో వేశారు. పోస్టుమార్టం నిర్వహించగా ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. మృతుడు అంజప్ప భార్య సుజాతను విచారించగా నేరాన్ని అంగీకరించింది. మిగిలిన ఇద్దరు నిందితులు పరార్ లో ఉన్నారని త్వరలో వారిని పట్టుకుంటామని తెలిపారు. సుజాతను రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ వివరించారు.