

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
ఆస్పత్రి నాలుగో అంతస్తులో ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదం వల్ల దవాఖానలో కరెంటు తీగలు దగ్ధమయ్యాయని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.