

- కాంగ్రెస్‌లో గెలిచి అధికారపార్టీలో చేరిక
- ఆ నిర్ణయమే వారి రాజకీయ కెరీర్‌పై తీవ్ర ప్రభావం
- ఎన్నికల సమయంలో ఉన్న సానుకూలత మాయం
- సొంత పార్టీలోను ఇద్దరి నాయకత్వంపై పెరిగిన వ్యతిరేకత
- గ్రూపులను సమన్వయం చేయడంలో విఫలం
- ప్రజాసమస్య పరిష్కారంలో అదే వైఖరి
- అందుకే రోజుకింత గ్రాఫ్ డౌన్
క్రైమ్ మిర్రర్- రంగారెడ్డి ప్రతినిధి
రాజకీయాల్లో హత్యలుండవు….అన్ని ఆత్మహత్యలే. మహేశ్వరం, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్నో ఆశలతో ప్రతిపక్ష పార్టీ కి చెందిన సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలను గెలిపిస్తే, ప్రజల ఆశలను వమ్ము చేస్తూ అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు వీరిద్దరూ లొంగిపోయారు. ప్రస్తుతం ఇద్దరు కూడా తమ, తమ నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలే వీర్ని గెలిపించుకున్నారు. ప్రతిపక్షం లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతారని భావించి ప్రజలు గెలిపిస్తే … అధికారం కోసం పార్టీ మారిన వీరి పట్ల ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి తో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల అంటూ వస్తే వీరిని ఘోరంగా ఓడించాలన్న కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ కార్యకర్తలు లోనూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్ల ఏమాత్రం సానుకూలత కనిపించడం లేదు. వీరిద్దరూ అధికార పార్టీలో చేరిన తర్వాత పార్టీకి జరిగిన మేలు అంటూ ఏమీ లేదని సొంత పార్టీ నేతలే బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన టిఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అన్నిచోట్ల మిశ్రమ ఫలితాలనే చవిచూసింది. మీర్ పేటలో మినహా ఆ పార్టీ తరఫున గెలిచినవారు ఏవరూ కూడా అటు మేయర్ గాను ఇటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాలేదంటే ఆ పార్టీ పరిస్తితి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పోరేటర్ గా విజయం సాధించిన చిగురింత పారిజాత నరసింహారెడ్డిని బలవంతంగా పార్టీ మారేలా ఒత్తిడి తీసుకువచ్చి ఆమెకు మేయర్ పదవి కట్టబెట్టారు. ఇక డిప్యూటీ మేయర్ స్థానంలో బీఎస్పీ తరఫున విజయం సాధించిన ఇబ్రహీం శేఖర్ ను తమ మేయర్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకుగాను ఆయన్ని కూర్చోబెట్టారు. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎక్స్ అఫీషియో ఓట్ల సహాయంతో గెలుచుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఆంధ్ర రాష్ట్రం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న కేకే ను తీసుకువచ్చి, చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయించడంతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయింది. ఇక చైర్మన్ గా ఎన్నికైన మధు సైతం తెరాస తరుపున గెల్చిన అభ్యర్థి కాకుండా, బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి అనంతరం టిఆర్ఎస్ లో చేరారు. ఇక మీర్ పేట విషయానికొస్తే డిప్యూటీ మేయర్ గా అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ అధిష్టానం ప్రకటించగా, సొంత పార్టీ కార్పొరేటర్లు సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి తీగల విక్రమ్ రెడ్డి ని గెలిపించుకున్నారు. అప్పుడే సబితా ఇంద్రారెడ్డి నాయకత్వం పల్చనయినట్లు స్పష్టమయింది. ఇక స్తానిక మేయర్ వ్యవహారశైలి వల్ల ఆమెకు ఎప్పటికప్పుడూ తలనొప్పి తప్పలేదు. ఇటీవల కార్పొరేటర్లు ఘర్షణకు దిగడం పరిశీలిస్తే , మంత్రి చేతుల నుంచి పార్టీ క్యాడర్ క్రమేపి చేజారుతున్నట్లు తేటతెల్లమవుతుంది.
ఇక ఎల్బీనగర్ ఎమ్మేల్యే సుధీర్ రెడ్డీ పరిస్థితి ఇందుకు మినహాయింపు ఏమి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన సుధీర్ రెడ్డిని ఎన్నికల్లో ప్రజలు, టీడీపీ సానుభూతి పరులు, కాంగ్రెస్ శ్రేణులు అన్ని తమన్నట్లు గా వ్యవహరించి గెలుపుకు కృషి చేశారు. కానీ గెల్చిన ఆర్నెల్ల కు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ను విడిచారు. విడిచి అధికార పార్టీ లో చేరారు. అయితే ఆయన పార్టీ వీడే ముందు నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యల పరిష్కారానికి అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల సమస్య తో పాటు, ఇంటి పన్నుల తగ్గింపు తో పాటు పలు సమస్యలను ప్రస్తావిస్తూ , పరిష్కారమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కానీ ఆయన అధికార పార్టీ లో చేరిన తరువాత ఆర్నెల్ల వ్యవధి లో ప్రజా సమస్యల పరిష్కరించకపోతే తన పదవికి రాజనామా చేస్తానని ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఇంటిపన్నుల తగ్గింపు, రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి నొచుకోకపోయినా, ఆయనకు మాత్రం కేబినెట్ స్థాయి పదవి దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో గెలిచి, ఆపార్టీనివీడిన సబితా ఇంద్రారెడ్డికి, సుధీర్‌రెడ్డిలకు మంత్రి పదవి, కేబినెట్ స్థాయి చైర్మన్ పదవులు దక్కాయని, కార్యకర్తలకు మాత్రం ఎటువంటి మేలు జరగలేదన్న వీరి సన్నిహితులైన నేతలు బహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో, ఈ రెండు నియోజకవర్గాల్లోని దళితులు, సబిత, సుదీర్రెడ్డిలను రాజీనామా చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
సబితమ్మ రాజీనామా చేస్తే తమకు కూడా దళితబంధు అమలవుతుందంటూ ఒక దళిత యువకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఇక సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు అంబేద్కర్‌కు వినతిపత్రాన్ని అందజేసి తమ నిరసన తెలియజేశారు. ఈ లెక్కన మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని దళితులు, బీసీలు దాదాపుగా పార్టీకి దూరమైనట్లుగానే కనిపిస్తోంది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన దళిత ఆత్మగౌరవ దండోరా సభ సక్సెస్‌లో, ఈ రెండు నియోజకవర్గాల్లోని క్యాడర్ కీలకంగా వ్యవహరించింది. దానికి కారణం… ఈ ఇద్దరిపై కాంగ్రెస్, తెరాస శ్రేణుల్లోని వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది.