

- డొంక కదులుతోంది
- తుర్కయంజాల్ సర్వే నెంబర్ 52లో రెవెన్యూ అధికారుల సర్వే
- అక్రమాలు తేల్చేందుకు అధికారుల రంగం సిద్ధం
- రెండుమూడు రోజుల్లో బయటపడనున్న అక్రమార్కుల బాగోతాలు
- క్రైమ్ మిర్రర్ వరుస కథనాలతో అధికారులు, నేతల్లో కదలిక
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 52లో భూమి ఆక్రమణలకు గురైందని, కాంగ్రెస్ నేతలు కొత్తకుర్మ మంగమ్మశివకుమార్ లాంటి నేతలు భూమిని కబ్జా చేసి అనుభవిస్తున్నారని క్రైమ్ మిర్రర్ రాసిన కథనాలకు అటు రాజకీయ పార్టీల నేతలు, ఇటు రెవెన్యూ అధికారుల్లో కదలిక మొదలైంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వయాన ప్రెస్మీట్ పెట్టి ఈ భూముల ఆక్రమణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. దీంతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చి రెవెన్యూ అధికారులతో సర్వే నిర్వహించతలపెట్టారు. సర్వే నెంబర్ 52లో మొత్తం భూమి 74 ఎకరాలకు గానూ సగానికి పైగా కబ్జాలకు, అక్రమాలకు గురైందని తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల సర్వేతో ఈ విషయాలన్నీ తేటతెల్లంకానుండటంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి ఆదేశాలతో రెవెన్యూ అధికారుల బృందం బుధవారం రోజున సర్వే నిర్వహించింది. త్వరలోనే సర్వే పూర్తిచేసి, బౌండరీలు నిర్ధారించనున్నారు. ఈ తరుణంలో అక్రమార్కులకు కంటిమీద కునుకులేకుండా మారిపోయింది. ఇప్పటికీ భారీ నిర్మాణాలు చేపట్టిన పలువురిలో భయం మొదలైంది. గతంలో సర్వే నెంబర్ 52కు ఆనుకుని వెంచర్లు చేసి, బై నెంబర్లతో భూమి కొనుగోలు చేసినట్టు చూపిస్తున్న నేతలకు ఏం చేయాలో తోచడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తకుర్మ మంగమ్మశివకుమార్ ఫాం హౌస్లో సగానికిపైగా ప్రభుత్వ భూమి ఉందని, బౌండరీలు ఏర్పాటు చేస్తే ఇవన్నీ తేటతెల్లం కావడం ఖాయమనీ చెబుతున్నారు. ఇంకో రెండ్రోజుల్లో అక్రమాలు నిగ్గుతేలనున్నాయి.