

- – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
క్రైమ్ మిర్రర్, ఇబ్రహీంపట్నం జులై 27 : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మస్కు నర్సింహ ప్రథమ వర్ధంతిని మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మస్కు నరసింహ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మస్కు నర్సింహ చిన్నతనం నుంచే వామపక్ష భావాలకు ఆకర్షితులై విద్యార్థి యువజన కూలీ పోరాటాల్లో ముందు వరుసలో నిలిచారని గుర్తు చేశారు.
2004లో ఇబ్రహీంపట్నం శాసన సభకు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా మద్దతుతో ఘన విజయం సాధించి ప్రజలకు నిజాయితీగా సేవ చేశారని గుర్తు చేశారు. మార్క్సిస్టు పార్టీ ముద్దుబిడ్డగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం, వెట్టి చాకిరి విముక్తి, అంటరానితనానికి వ్యతిరేకంగా, శ్రమజీవుల హక్కులకోసం కడవరకు కృషి చేశారని వివరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగడానికి కృష్ణా వాటర్ జలాలు కావాలని, మాల్ నుండి హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడంలో తన పోరాటం ఆమోగమైనదన్నారు.
సిపిఎం పార్టీ నిర్మాణం కోసం చివరిశ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు అని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. మస్కు నరసింహ కలలుగన్న ఆశయాలను ప్రతిఒక్కరు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రామచందర్, సీనియర్ నాయకులు జాన్ వెస్లీ, ఆయా మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.