

- వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మర్రిగూడ ఎంపిపి
- సమయ పాలన,పరిశుభ్రత,మెరుగైన వైద్యంపై ఆరా
- పర్యవేక్షణ,పనితీరుపై, అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎంపిపి మోహన్ రెడ్డి
నల్లగొండ నిఘా ప్రతినిధి జులై 26 (క్రైమ్ మిర్రర్): జిల్లాలోని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన వైద్య కమిటీ మీటింగ్ నందు అడ్వైజర్ కమిటీ చైర్మన్ ఎంపిపి మెండు మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజలకు నిత్యం సేవలు అందించాల్సిన మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి నందు నాణ్యమైన వైద్యం అందించడం లేదని, సరైన సమయపాలన పాటించకుండా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రమైన వాతావరణం ఉందని అన్నారు.సరియైన సమయానికి వైద్యులు ఆసుపత్రికి రాకుండా ఉండడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, ఇదంతా పర్యవేక్షణ లోపం వల్లే జరుగుతుందని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. ఇక నుండి వైద్య సిబ్బందుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినట్లయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సంబంధిత అధికారి పై చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు. ఇకనైనా వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య,ఎమ్మార్వో దేశ్య నాయక్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, తదితరులు పాల్గొన్నారు.