

తుర్కయంజాల్, జులై 19 క్రైమ్ మిర్రర్: కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని, కౌన్సిల్‌కు జవాబుదారీగా ఉండాలని తుర్కయంజాల్ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి పునరుద్ధాటించారు. మున్సిపాలిటీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాలకవర్గ సమావేశానికి కమిషనర్, అధికారులు హాజరుకాకపోవడం సరికాదన్నారు. సోమవారం రోజున కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆఫీసుకు రాగానే కమిషనర్ వెళ్లిపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో ఉండి, అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్నదే తమ ఆకాంక్షని, దీనికి కమిషనర్, అధికారులు సహకరించకపోవడం శోచనీయమన్నారు. మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి పనులపై నోట్ ఫైల్ ఇవ్వడానికి కమిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడంలేదన్నారు. మున్సిపాలిటీ ఆదాయం లక్షల్లో విత్ డ్రా చేస్తూ, ఆ లెక్కలు చెప్పకపోవడమేంటన్నారు. నిధుల విషయంలో అన్ని వార్డులకు సమన్యాయం చేస్తామని, వచ్చే బడ్జెట్ సమావేశంలో అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. సంఘీనగర్‌లో వరద బాధితుల డబ్బులను పక్కదారి పట్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో తీర్మానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ హరితాధన్‌రాజ్‌గౌడ్, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ కరాడి శ్రీలత అనిల్‌కుమార్, కౌన్సిలర్లు కొత్తకుర్మ మంగమ్మశివకుమార్, కంబాలపల్లి ధన్‌రాజ్, కుంట ఉదయశ్రీగోపాల్రెడ్డి, మర్రి మాధవి మహేందర్‌రెడ్డి, బొక్క రవీందర్‌రెడ్డి, కాకుమాను సునీల్, నక్క శివలింగం గౌడ్, బండారి బాలప్ప, కాంగ్రెస్ నాయకులు వంగేటి గోపాల్‌రెడ్డి, మేతరి దర్శన్, బొక్క గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.