

- సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు
- కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం విడ్డూరం
- మణుగూరు వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత
- తాగునీటి, కరెంట్ సరఫరా లేక అవస్థలు
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడెండ్లయినా అభివృద్ధి శూన్యం
- తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా
భద్రాద్రి కొత్తగూడం, క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడెండ్లు పూర్తవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్యాల మురళీధర్ గుప్తా అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. శ్యామ్ సుందర్, సెక్రటరీ జనరల్ అయనాల కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శులు సత్తార్ఖాన్, ఇంద్రసేన, సెక్రటరీ భాస్కర్ రెడ్డి, యూత్ ఇన్చార్జీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ గుప్తా మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 90 శాతం గిరిజన జనాభా ఉందన్నారు. చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదన్నారు. మారుమూల కొండకోనల్లో నివసించే గిరిజనులకు ఏదైనా ప్రమాదం సంభవించినా, రోగాలకు గురైన సరైన వైద్య సౌకర్యం లేదన్నారు. డాక్టర్లు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూత పడ్డాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శేషగిరి నగర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వైద్య సిబ్బంది లేక మూత పడిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిన్న మొన్న కురిసిన వర్షాలకు గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగి పొర్లడంతో పది గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుతుందన్నారు. ఇప్పటికే భద్రాచలం పినపాక మండలం మణుగూరు మండలాల్లో చాలా ఆదివాసి ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదన్నారు. ఏల్లాపురం, పాట్లపల్లి, మారెడుగూడెం, ఇప్పలసంపు, గుత్తెబోయి లకు బస్సు సౌకర్యం లేదు. మణుగూరు ఏరియా ఆస్పత్రిలో 100 పడకల ఆస్పత్రిలో వైద్యులు లేరన్నారు. గుండాల మండలం మామకన్న గ్రామ పంచాయతీలో కిష్టాపురం రెవెన్యూ రికార్డులో ఉన్న బాటన్న నగర్ ఆదివాసిలు నివసించే గ్రామంలో ఇప్పటికే కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాయమాటలతో గద్దెనెక్కిన టీఆర్ ఎస్ ప్రభుత్వం గిరిజన ఆదివాసుల పట్ల అనాసక్తత ప్రదర్శిస్తు, వారు చేసుకుంటున్న పోడు భూములు లాక్కుని గిరిజనుల పైన కేసులు బనాయిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజనుల పట్ల వందలాది కేసులు బనాయించి, గిరిజనులను అభివృద్ధి నుంచి దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల పార్టీ నాయకులు పాల్గొన్నారు.