

- సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నతాధికారుల విచారణ?
- విజిలెన్స్‌కు ఉన్నతాధికారులు సిఫార్సు చేసినట్లు సమాచారం
- నేడో రేపో క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్న ప్రత్యేక బృందం
- క్రైమ్ మిర్రర్ కథనాలను సుమోటోగా తీసుకుని విచారణ?
రంగారెడ్డి నిఘా ప్రతినిధి: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం వస్తోంది. గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఉన్నతాధికారులు స్పెషల్ టీంను పంపనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ మిర్రర్ కథనాలను, అప్పటి బిల్ కలెక్టర్ యాదయ్య ఇచ్చిన ఎవిడెన్స్‌తో క్షేత్రస్థాయి విచారణ జరగబోతున్నట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది.
కొత్తకుర్మ మంగమ్మ సర్పంచ్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది జగమెరిగిన సత్యమే. అప్పట్లో క్షేత్రస్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపి మంగమ్మ అక్రమాలను బట్టబయలు చేయడంతో సస్పెండైనది విషయం తెలిసిందే. ఇంత జరిగినా కూడా మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ ప్రవర్తనలో ఎలాంటి మార్పురాకపోవడం వారి నేరప్రవృత్తిని తెలియజేస్తోంది. డబ్బు సంపాదనే పరమావధిగా చేసుకుంటూ అక్రమాలకు తెరలేపి అనధికార లే అవుట్లు, బఫర్ జోన్లలో ఇంటి పర్మిషన్లు ఇచ్చి అందినకాడికి దోచుకొని కోట్లకు పడగలెత్తాలనే దురాశ… ఇన్నాళ్లకు మళ్లీ వారి మెడకు చుట్టుకునే అవకాశం కనబడుతోంది.
ముఖ్యంగా మాసాబ్చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆదిత్యనగర్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, శోభానగర్లోని చెరువు శిఖంలో ఇళ్లకు ఇబ్బడిముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చి బాధితుల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారని జనాల నోళ్లలో నానుతున్న విషయం. నకిలీ గ్రామ పంచాయతీ పర్మిషన్లతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది మంగమ్మేనంటూ లోకమంతా కోడై కూస్తోంది. ఆ ఇళ్ల యజమానులు ఇన్నాళ్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు. క్రైమ్ మిర్రర్ వరుస కథనాలతో అటు రాజకీయ నాయకులను, ఇటు క్రైమ్ మిర్రర్ పత్రికా యాజమాన్యాన్ని బాధితులు అప్రోచ్ అవుతున్నారు. ఇప్పటివరకు వందల మంది బాధితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. ఇదే విషయమై తుర్కయంజాల్ కమిషనర్ అహ్మద్ సఫీ ఉల్లా వందల కొద్దీ నకిలీ గ్రామపంచాయతీ పర్మిషన్లు, అక్రమ లే అవుట్లు, అనుమతులు లేని నిర్మాణాల జాబితాను సిద్దం చేసి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 21వ వార్డు, 10వ వార్డు పరిధిలోనే ఈ అక్రమాలు జరగాయని తేటతెల్లమైనట్లు అనధికారవర్గాల నుంచి సమాచారం అందుతోంది.
అయితే వీటన్నంటిపై వరుస కథనాలను సంధించిన క్రైమ్ మిర్రర్ కథనాలను సుమోటోగా తీసుకుని విజిలెన్స్ విచారణకు ఉన్నతాధికారులు సిఫారసు చేశారన్న విషయం బయటకు వచ్చింది. మంగమ్మ అక్రమ వ్యవహారాలపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీచేసినట్లు చెప్పుకుంటున్నారు. రేపోమాపో ఓ స్పెషల్ టీం తుర్కయంజాల్‌కు రానుందని తెలుస్తోంది. ప్రత్యేక బృందం దర్యాప్తులో అక్రమాలు నిగ్గుతేలితే క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చేసిన తప్పుల పట్ల ఇప్పటికే కుమిలిపోతున్న మంగమ్మకు ఇది మింగుడుపడని విషయం. ఎప్పటికైనా ఎమ్మెల్యే పదవి చేపట్టాలని కలలుగంటున్న మంగమ్మశివకుమార్కు ఇలా వరుస అక్రమాలకు పాల్పడుతూ, నిరంతరం జనాలపై పడి డబ్బులు దండుకుని బతికేద్దామనుకునే వ్యవహారాలతో ఆ కల నెరవేరడం సాధ్యమేనా అన్న చర్చలు మొదలయ్యాయి.