
యాదాద్రి ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమం.. గ్రామస్తులను అనారోగ్యం పాలు చేసింది. కేసీఆర్తో పాటే భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు లోనయ్యారు. ఇందులో కేసీఆర్ పక్కనే కూర్చొని తిన్న వృద్ధురాలు ఆకుల ఆగమ్మ.. కొద్దిసేపటికే పూర్తి కాగానే వాంతులు చేసుకుంది. ఇంటికి వెళ్లాక రాత్రిపూట కూడా అదే సమస్య ఎదురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తొలుత వృద్ధురాలికే ఏదో ఇబ్బంది ఉండి అలా జరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మరుసటి రోజు అదే కార్యక్రమంలో పాల్గొన్న మరో బాలికకు వాంతులతో బాధపడింది. ఆమెకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందించారు.
అయితే ఈ ఇద్దరితో పాటు సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరైన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో వారందరినీ కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు అధికారులు. పదుల సంఖ్యలో గ్రామస్తులు అనారోగ్యబారినపడటం కలకలం రేపుతోంది. ఒక్కసారిగా ఇంతమందికి ఎందుకు సమస్య తలెత్తిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆహారం కలుషితం కావడమే కారణమై ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. భోజనం పడకనే అలా జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమంలో దాదాపు 2500 మంది పాల్గొన్నారు. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖంపడుతున్న సమయంలో.. స్వయంగా ముఖ్యమంత్రే సామూహిక కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పైగా రెండు టాబ్లెట్లు వేసుకుంటే చాలు కరోనా పరార్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..