
వాలంటీర్లు, ప్రజా ప్రతినిధుల సేవలకు అభినందన
నల్లగొండ ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: గట్టుప్పల్ లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గించే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా కృషి చేయాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు. బుధవారం చండూర్ పరిధిలోని గట్టుప్పల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, స్థానిక వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బందితో ముచ్చటించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో ఉండాలని సూచించారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తులు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ వారి నుండి మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గట్టుప్పల్ గ్రామంలో పాజిటివ్ కేసుల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్యం పరిరక్షించడం కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని చెప్పారు. గట్టుప్పల్ ఐసోలేషన్ కేంద్రంలో, గ్రామంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పని చేస్తున్న వలంటీర్లు, వైద్య, పోలీస్ సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. డిఐజి వెంట చండూర్ సిఐ సురేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులున్నారు.