
కొవిడ్ మహమ్మారి మావన సంబంధాలకు పాతరేస్తోంది. కొవిడ్‌తో ఎవరైనా మృతిచెందారనే తెలిస్తే అయినవాళ్లే ముఖం చాటేస్తున్నారు. భర్త మృతదేహాన్ని రాత్రంతో ఇంట్లోనే ఉంచుకుని పదేళ్లలోపు ముగ్గురు పిల్లలతో బిక్కుబిక్కమంటూ గడిపింది ఓ మహిళ.
భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్ మిర్రర్: అశ్వారావుపేట మండలం మొద్దులగూడెంలో ఓ వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందాడు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు. ఫళితంగా రాత్రంతా మృతదేహం ఇంట్లోనే పెట్టుకుని గడిపింది ఆ ఇళ్లాలు. గ్రామానికి చెందిన వగ్గేల లక్ష్మణరావు (42) 4 రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచాడు. తన భర్త మృతిచెందాడని భార్య గ్రామస్థులకు బంధువులకు చెప్పినా ఎవ్వరూ ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. చేసేదేమీలేక పదేళ్లలోపు ముగ్గురు పిల్లలతో భర్త మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపింది ఆ ఇళ్లాలు.ఈ విషయాన్ని గ్రామస్థులు సర్పంచ్‌కు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ఊళ్లోకి వెళ్లి అవగాహన కల్పించారు. స్థానికులు సహకారంతో సర్పంచ్ ఆధ్వర్యంలో మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు.