మంత్రి పదవిపై ఆశ లేదన్న రాజగోపాల్‌రెడ్డి – ఇస్తే పార్టీకే మేలంటూ మెలిక..!

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా… మంత్రి పదవి గురించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మంత్రి పదవి గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. తాను మంత్రి పదవిని ఎప్పుడూ కోరుకోలేదు అంటూనే… ఇస్తే కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకే మేలంటూ మెలిక పెడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో తన కృషి కూడా ఉందని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.. చెప్తున్నారు కూడా. భువనగిరి ఎంపీ స్థానాన్ని నిద్రహారాలు మానేసి గెలిపించానని అన్నారాయన. ఎంపీగా కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.

Read More : నన్ను ఎంతో హింసపెట్టాడు – కేసీఆర్‌ను వదిలే లేదన్న రాములమ్మ

మంత్రి పదవి ఆశించలేదని ఆయన పైకి అంటున్నా… అందులో ఎంత నిజముందో ఆయనకే ఎరుక. మంత్రి పదవి ఆశించే.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారన్న వార్తలు… అప్పట్లో చాలానే వచ్చాయి. అయితే… ఇద్దరు అన్నదమ్ముళ్లకు మంత్రి పదవి ఇవ్వడం సరికాదని.. అధిష్టానం.. రాజగోపాల్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోలేదు. అయినా.. ఆయన ప్రయత్నాలు ఆపలేదని సన్నిహిత వర్గం చెప్తుంది. గతంలో చాలాసార్లు కూడా మంత్రి పదవిపై మాట్లాడారు రాజగోపాల్‌రెడ్డి. మినిస్టరీ కోసం తాను పైరవీలు చేయడంలేదని.. పైరవీలు చేస్తే ముఖ్యమంత్రినే అయ్యే వాడినని కూడా గతంలో చెప్పారు.

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు నలుగురు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నారు. పైగా… రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్‌లో రూల్‌ పెట్టుకున్నారు. దీంతో.. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పోస్టుకు ఎసరొచ్చింది. అయితే… కేబినెట్‌ విస్తరణలో అయినా.. తనకు అవకాశం దక్కకపోదా అని ఎదురుచూస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి.

 

Exit mobile version