

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు టీట్వంటీ వరల్డ్ కప్ లో దారుణంగా ఆడుతోంది. ఎన్నో అంచనాలతో దుబాయ్ వెళ్లిన కోహ్లీసేన.. పేలవమైన ఆట తీరుతో మొదటి రెండు మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తైన కోహ్లీసేన… రెండో మ్యాచ్ లో కివీస్ తోనూ ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో గ్రూప్ 2లో ఐదో స్థానంలో నిలిచింది. ఆప్ఘనీస్తాన్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. నమీబియా కూడా భారత్ పైనే ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో భారత్ ఇంకా మూడు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నదానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి.
సాంకేతికంగా చూస్తే ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ దారులు ఇంకా కనిపిస్తున్నయి. సెమీస్ చేరే చాన్సులున్నా..అందుకు ఇతర లెక్కలు మనకు అనుకూలించాల్సి ఉంటుంది. గ్రూప్ 2లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. నమీబియా, స్కాట్లాండ్లతో ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో గెలిస్తే పాకిస్థాన్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్ చేరే రెండో జట్టుపైనే ఉత్కంఠ నెలకొంది. భారత్ పై గెలిచిన న్యూజిలాండ్ రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారత్ ఆడిన రెండింటిలో ఘోర పరాజయం చవిచూడడంతో మన రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. భారత్ ఇంకా అఫ్ఘానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాతో ఆడాలి. ఈ మూడింటిలో మనోళ్లు గెలుపొందుతారనే అనుకుందాం. నెగ్గడమంటే నెగ్గడం కాదు.. భారీ తేడాతో విజయం సాధిస్తేనే మన రన్‌రేట్ మైనస్ నుంచి ప్లస్‌కు చేరుతుంది. అప్పుడు ఆరు పాయింట్ల మన ఖాతాలో ఉంటాయి.
ఇక నమీబియా, స్కాట్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్లతో న్యూజిలాండ్ కూడా తలపడాల్సి ఉంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న కివీస్ నెట్‌రన్‌రేట్ (+0.765) మనకంటే మెరుగ్గా ఉంది. ఇక ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ విజయం సాధిస్తే.. టీమిండియా సెమీస్ అవకాశాలు గల్లంతే. అలా జరగకూడదనుకుంటే.. న్యూజిలాండ్‌ను ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనున్న అఫ్ఘానిస్థాన్ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, న్యూజిలాండ్, అఫ్ఘాన్ తలా ఆరు పాయింట్లతో పట్టికలో సమంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల రెండు వరుస పరాజయాల భారం నుంచి కోలుకొని తదుపరి మూడు మ్యాచ్‌ల్లో భారత్ సూపర్ గా ఆడాలి. ఏదేమైనా వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ అవకాశాలు కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
2007 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ తో ఓటమితో లీగ్ దశనుంచి ఇంటి దారి పట్టింది టీమిండియా. టీమిండియా తీరుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అప్పటి కెప్టెన్ ద్రావిడ్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. ఇపుడు అదే తరహాలో లీగ్ దశలోనే ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టాలు తప్పకపోవచ్చు.