
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై భిన్నవాదనలు వస్తున్నాయి. ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారని టీడీపీ వర్గాలు చెబుతుండగా… స్పందనే లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన ప్రజాదర్భార్ జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు శివ వచ్చాడు. ఆ సమయంలో చంద్రబాబు పీఏ మనోహర్ శివ గురించి ఆయన చెవిలో వేశారట. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట శివ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని… ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేయిస్తున్నట్లు చంద్రబాబుతో చెప్పారట. అది వినగానే చంద్రబాబు శివపై ఫైర్ అయ్యారని… ఎన్టీఆర్పై అభిమానంతో పార్టీలో చీలికలు తీసుకొచ్చే పనులు చేయొద్దని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని చంద్రబాబు సంకేతాలిచ్చినట్లయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఏనాటికైనా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని.. టీడీపీ పగ్గాలు చేతపట్టాలని కోరుకుంటున్నారు. ఒకానొక దశలో ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అదంతా వట్టి ఊహాగానాలే అని తర్వాత తేలిపోయింది.తెలంగాణలో ఇప్పటికే ఉనికిని కోల్పోయిన టీడీపీ… ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ విజయ బావుటా ఎగరేసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేనిది కుప్పంపై ప్రేమ కురిపిస్తున్నారని… అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నారని అంటున్నారు.
టీడీపీ ఇలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని… అందుకే తాజాగా ఎన్టీఆర్ అభిమానిపై సైతం ఫైర్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.