

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వివాదమవుతోంది. గత ఏప్రిల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా.. వివిధ కారణాలతో కొన్నింటికి ఆగిపోయాయి. గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే గురువారం దీపావళి పండుగ అయినా నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీపావళి పండుగ రోజున ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
దీపావళి సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని విమర్శించారు. దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోబావాలను దెబ్బతీయటమే అన్నారు చంద్రబాబు. ఇదే రోజు క్రిస్మస్ ఉంటే నామినేషన్ల ప్రక్రియ పెట్టేవారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హిడన్ అజెండాలో భాగంగానే దీపావళి రోజున ఎన్నికల నామినేషన్ పెట్టారని టీడీపీ అధినేత మండిపడ్డారు. పీకమీద కత్తిపెట్టినట్లు దీపావళి రోజున నామినేషన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
One Comment