తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న రేవంత్.. ఫైనల్ లిస్టుతో హైదరాబాద్ వస్తారని చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారని సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలనే అంశంపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో ఎవరెవరు ఉన్నారు.. కేబినెట్ లో అవకాశం లేకపోతే వాళ్లను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై క్లారిటీకి వచ్చారని అంటున్నారు.
డిప్యూటీ స్పీకర్ గా బాలు నాయక్ ను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. మంత్రిపదవి కోసం పట్టుబడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శాసనసభ చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రులుగా వాకిటి శ్రీహరి , ప్రేంసాగర్ రావు, సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియరైందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్జి జిల్లాకు సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదని టాక్. బిఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారని సమాచారం.