
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నటి కరాటే కళ్యాణీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ‘మా’ సభ్యురాలిగా ఉన్న కరాటే కళ్యాణీని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అసోసియేషన్‌లో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘మా’ జనరల్ సెక్రటరీ వై.రఘుబాబు గురువారం కరాటే కళ్యాణీకి సస్పెన్షన్ నోటీసు పంపించారు. ఈనెల 16 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువు లోపల వివరణ ఇవ్వకపోగా లీగల్ నోటీసు పంపడం ‘మా’ సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 23న జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో కరాటే కళ్యాణి ప్రవర్తనపై చర్చించి.. ‘మా’ బైలాస్‌లోని క్లాజ్ నంబర్ 8 ప్రకారం తక్షణమే సస్పెన్షన్ అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
Read Also : ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు.. ఖర్చుల కోసం 105 కోట్లు విడుదల చేసిన కేసీఆర్
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం ప్రతిష్టించడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈనెల 28న ప్రతిష్టించడానికి విగ్రహం కూడా తయారుచేయించారు. అయితే, ఈ విగ్రహ ఏర్పాటును కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో కొందరు కరాటే కళ్యాణీని తప్పుబడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంతో ఆమె చెలరేగిపోయారు. ఎన్టీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే, తెలుగు సినిమాకు గర్వకారణమైన నందమూరి తారక రామారావు గురించి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈనెల 16న కరాటే కళ్యాణీకి షోకాజ్ నోటీసు పంపారు.
Also Read : నల్గొండ ఐటీ టవర్ లో 200 ఉద్యోగాలు.. ప్రకటించిన సొనాటా సాఫ్ట్ వేర్
ఆ తరవాత కరాటే కళ్యాణి.. మంచు విష్ణుని కూడా కలిశారు. కానీ, ఈ విషయంలో కళ్యాణి వెనక్కి తగ్గలేదు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తే ఊరుకునేది లేదని నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ క్రమంలో కొన్ని హిందూ సంఘాలతో హైకోర్టుకు కూడా వెళ్లారు. వీరిని అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి వీళ్లేదని స్టే విధించింది. మరోవైపు, ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై మూడు రోజులలోగా వివరణ ఇవ్వాలని కరాటే కళ్యాణీకి ‘మా’ షోకాజ్ నోటీసు ఇచ్చింది. లేని పక్షంలో కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని నోటీసులో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ నోటీసును అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలని కూడా చెప్పారు. కానీ, ఈ షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వకపోవడంతో కరాటే కళ్యాణీపై చర్యలు తీసుకున్నారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ అవార్డు.. బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
- అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
- ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
2 Comments