
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులు అధైర్య పడొద్దని వారిని కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. కేంద్రానికి నివేదిక పంపించబోమని అన్నారు. గతంలో చాలా సార్లు నివేదికలు పంపామని కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో పర్యటించిన సీఎం కేసీఆర్.. వర్షం వల్ల నష్టం జరిగిన పంటలను పరిశీలించారు. గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు.
Read Also : 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు ? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. “అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురి కావొద్దు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. వ్యవసాయం దండగ అనే మూర్ఖులు ఉన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తాం. కౌలు రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకుంటుంది. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోంది. దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవు. మెుత్తం వ్యవసాయ పాలసీలను బీఆర్ఎస్ ఇస్తుంది.” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు. అంతకు ముందు సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు.
Also Read : నేడు నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన… నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్
అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం సీఎం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకొని పరిసర గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇవి కూడా చదవండి :
- నేడు సిట్ ఎదుటకు టీపీపీసీ రేవంత్… TSPSC పేపర్ల లీక్ ఆరోపణలపై వివరణ
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు… మరో నాలుగు పరీక్షలు వాయిదా ?
- తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు.. విచారణ ఈ నెల 27కు వాయిదా
- టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
- చంద్రబాబు పగటికలలు కంటున్నారు. కనమనండి… మంత్రి ఆర్కే రోజా సెటైర్లు
One Comment