
కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో దొంగలు పడ్డారు. ప్రధాన ఆలయం గర్భగుడిలో బంగారు, వెండి నగలు, వస్తువులు అపహరించారు. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్యాల సీఐ కొండగట్టు ఆలయానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. కొండగట్టు ఆలయంలోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. వేలు ముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో ఆలయ పరిసరాలను తనిఖీ చేశారు. ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకు వెళ్లి డాగ్ ఆగింది.
అర్ధరాత్రి ఒంటిగంట 30 నిమిషాల సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళ గుడి ప్రాంతం నుంచి లోపలకు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయం వెనుక ద్వారాన్ని తెరచి లోపలకు వచ్చినట్లు తేల్చారు. నిందితుల చేతుల్లో కటింగ్ ప్లేయర్స్ ఉన్నట్లు సీసీ ఫుటీజీలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్స్ ను పోలీసులు రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.ఆలయంలో 15 కిలోల వెండి, బంగార నగలు మాయమైనట్టు నిర్ధారించారు. స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధ మండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల వెండి శఠగోపాలు, 5 కిలోల వెండి తొడుగును దొంగలు ఎత్తుకెళ్లారని నిర్ధారించారు.
ఇటీవల కొండగట్టు క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు ప్రకటించారు. అలాగే సీఎం కొండగట్టు రావడానికి ముందే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తం రూ. 600 కోట్లతో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఆంజేయనేయస్వామి ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొండగట్టు ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆలయానికి కనీస భద్రత లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి..