
హైదరాబాద్ లోని అంబరపేటలో కుక్కల దాడిలో పసివాడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడి ఘటనలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని.. మీ నిర్లక్ష్యం వీడడం లేదంటూ అధికారులపై సీరియస్ అయ్యింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.
బాలుడిపై కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు తెలంగాణ చీఫ్ సెక్రటరీ జీహెచ్ఎంసీ హైదరాబాద్ కలెక్టర్ అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 16వ తేదీనికి వాయిదా వేసింది.హైదరాబాద్ నగరం అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలుడిపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడు తీవ్రగాయాలతో మృతిచెందాడు.
కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రంగా ఉందని.. వాటి నిర్మూలనలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరెవరికి ఇలాంటి పరిస్థితి రాకుండా కుక్కకాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 13 పాయింట్స్ తో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.