
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ – ఇటీవలి కాలంలో తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు తరచుగా చెబుతున్న మాట ఇది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో.. తెలంగాణను దేశంలోని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తాయనేది ఈ మాటల అంతరార్థం. ఇది వాస్తవం కూడా. దీని కంటే ముందు ‘కేసీఆర్ తొలి అడుగేశారు.. తెలంగాణ సమాజం ఆయన్ను అనుసరించింది’ అనే మాటను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తున్న వారెవరైనా ఇది అక్షర సత్యం అని అంగీకరిస్తారు. తెలంగాణ ఉద్యమం పెద్దగా క్రియాశీలకంగా లేని రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ను చూసి ఆంధ్రా ప్రాంత నాయకులు నవ్వుకున్నారు. కానీ, పదునైన తన మాటలతో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఆకర్షించిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేలా చేయడంలో విజయవంతమయ్యారు.
Read Also : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
రాజకీయంగానూ చాకచక్యంగా వ్యవహరించి దేశంలోని రాజకీయ పక్షాలను తెలంగాణకు మద్దతుగా ఒప్పింది.. ప్రత్యేక రాష్ట్రం సాధన కలను సాకారం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తొలి నాళ్లలో తెలంగాణ వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. అంతకు ముందు ఉద్యమాలు చేసినా.. అవి నీరుగారిపోయాయి. కానీ భారత చిత్రపటం మీద తెలంగాణ అనే నూతన రాష్ట్రం వచ్చి చేరుతుందని కేసీఆర్ బలంగా నమ్మారు. ఆచార్య జయశంకర్ లాంటి మేధావుల సాయంతో తెలంగాణ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతను తనదైన భాషలో పామరులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంలో కేసీఆర్ విజయం సాధించారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉద్యమ కాంక్షను రగల్చడంలో సక్సెస్ అయ్యారు. 2001లో కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంట కొద్ది మందే ఉన్నారు. కానీ, కేసీఆర్ వ్యూహాలతో.. పదేళ్లు గడిచే సరికి కోట్లాది గొంతుకలు జై తెలంగాణ అని నినదించాయి. తెలంగాణ ఏర్పాటు కోసం అవసరమైతే తన ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమని కేసీఆర్ చాటారు. తెలంగాణ ఉద్యమంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం కోసం.. కేంద్రం మెడలు వంచడం కోసం.. ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
Also Read : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో.. 2009 నవంబర్ చివర్లో ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. సిద్ధిపేట వద్ద దీక్ష చేయాలని భావించగా.. ఆయన్ను అడ్డుకున్న అప్పటి ప్రభుత్వం.. ఖమ్మం జైలుకు తరలించగా.. జైల్లోనే ఆయన దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ప్రభుత్వం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందనే వార్తలతో తెలంగాణ సమాజం భగ్గుమంది. నాలుగు కోట్ల మంది ప్రజలు జై తెలంగాణ అని నినదించడంతో.. ఉమ్మడి రాష్ట్రంలోని పార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించాయి. తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాతే కేసీఆర్ దీక్షను విరమించారు. ఉద్యమాలు చేసిన వారంతా.. తర్వాత పాలకులుగా విజయం సాధిస్తారని చెప్పలేం. కానీ, కేసీఆర్ మాత్రం అందుకుభిన్నం. విజయవంతమైన పాలకుడిగా నిలిచారు. తెలంగాణ తెచ్చిన తనకే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టడంతో.. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలుపెట్టారు. ఇక్కడి బిడ్డలకు ఏమేం అవసరమో అవన్నీ చేయడం మొదలుపెట్టారు. మిషన్ కాకతీయతో చెరువులకు మళ్లీ జీవం పోశారు.
Read Also : రేవంత్ రెడ్డిని కలసి మురిసిన చిన్నారులు… వర్దన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర
మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు ఇవ్వడంతోపాటు ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు. రైతు బంధుతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలెన్నో. ప్రజా సంక్షేమం మాత్రమే పాలకుడి ప్రాధాన్యమైతే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. ఈ విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు గనుకే.. అభివృద్ధి విషయంలోనూ తగిన శ్రద్ధ వహించారు. రాష్ట్రానికి మణిహారం లాంటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో.. నగరంలో మౌలిక వసతులు కల్పన ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. మిషన్ కాకతీయతో పాటు.. కాళేశ్వరం పుణ్యమా అని తెలంగాణ మునుపెన్నడూ లేని రీతిలో ఆకుపచ్చగా మారింది. పంటలు అంచనాలకు మించి పండాయి. అటు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయపరంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. తెలంగాణ జీఎస్‌డీపీతో పాటు.. ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది.
Also Read : సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. కేసీఆర్ స్థానంలో ఇంకెవరున్నా.. తాను సాధించిన విజయాలతో సంతృప్తి చెందుతారు. అక్కడితో ఆగిపోతారు. కానీ కేసీఆర్ ఓ గొప్ప స్వాప్నికుడు. ఇక్కడితో ఆగిపోవడం ఆయనకు ఇష్టం లేదు. తెలంగాణ తరహాలోనే భారతదేశం మొత్తాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలనే సంకల్పం బూనారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలవైపు వడి వడిగా అడుగులేస్తున్నారు. దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మోదీని ఢీకొట్టడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ, కేసీఆర్ మాత్రం బీజేపీతో సై అంటున్నారు. రెండు దశాబ్దాల కిందట ఎలాగైతే బంగారు తెలంగాణను స్వప్నించి.. ఆ కలను సాకారం చేసుకున్నారో.. ఇప్పుడు అదే విధంగా.. ప్రపంచ శక్తిగా భారత్‌ను నిలపాలనే సంకల్పంతో కేసీఆర్ ముందడుగేస్తున్నారు. ఒకప్పుడు తనను చూసి ఎంత మంది నవ్వినా సరే.. పట్టించుకోకుండా అనుకున్నది చేసి చూపించిన కేసీఆర్.. ఇప్పుడు కూడా అదే మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ విజయం సాధించాలని.. జాతీయ స్థాయిలోనూ ఆయన రాణించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్.
ఇవి కూడా చదవండి :
- బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన కొప్పుల జగన్ గౌడ్..
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
- మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
- ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
2 Comments