
2019లో జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం కాగానే చేసిన మొదటి పని.. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజావేదికను కూల్చేయడమే. ప్రజావేదికలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి మరీ.. ఇది అక్రమ నిర్మాణమని.. దీన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించారు సీఎం జగన్. బుల్డోజర్లు పెట్టి మరీ.. రాత్రికి రాత్రి ప్రజావేదికను నేలమట్టం చేశారు. ఆ ఘటనపై అనేక విమర్శలు వచ్చినా.. వైసీపీ సర్కారు లెక్కచేయలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే…
ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదంటూ సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. దిష్టిబొమ్మలు తగలబెట్టింది. డీజీపీకి ఫిర్యాదు చేసింది. పీఎస్ ల్లో కంప్లైంట్ చేసింది. బీఆర్ఎస్ ఇంతగా లొల్లిలొల్లి చేసినా.. రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. ప్రగతి భవన్ ను పేల్చేయాలనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. తాను ప్రజల అభిప్రాయమే చెప్పానని.. కేసులకు భయపడేదేలే అంటూ మరింత ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే ఏపీ సీఎం జగన్ గుర్తొస్తున్నారని అంటున్నారు రాజకీయవేత్తలు. సీఎం చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను.. జగన్ సీఎం అయిన వెంటనే కూల్చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పదే పదే చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే.. వెంటనే చేసే మొదటి పని ఇదేనంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. జగన్ ప్రజావేదికను కూల్చేసినట్టు.. రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను కూల్చేస్తారని అంటున్నారు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని రేవంత్ రెడ్డి చెప్పడం అందుకు ఇండికేషనే అని చెబుతున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి అలాంటి విధ్వంసకర పనులు చేయరని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రగతిభవన్ గేట్లను ప్రజల కోసం ఓపెన్ చేస్తారని.. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ చేస్తారని మరికొందరు వాదిస్తున్నారు. ఏదిఏదైనా, రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ప్రసంగాలను ప్రగతి భవన్ చుట్టూనే తిప్పుతుండటం మాత్రం ఆసక్తికరంగా మారింది.