
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. గత ఏడాదిన్నర కాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సరదాగా గడిపారు. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ ను సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. ఈ సన్నివేశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. ఇదే కాదు మరో సంచలన ఘటన అసెంబ్లీలో చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాత్రం కులాసాగా కబుర్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలను అధికార బీఆర్ఎస్ సభ్యులు పలకరించారు. మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఆ తర్వాత ఈటలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. హుజురాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ ఈటలను ఆరా తీశారు. పిలిస్తేగా వచ్చేది.. అంటూ ఈటల కాసింత కటువుగానే ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది.వారం రోజులుగా హుజురాబాద్ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. మంత్రి కేటీఆర్ జగిత్యాలలో జరిగిన సభలో ఈటల రాజేందర్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తండ్రిలాంటి కేసీఆర్ ను మోసం చేశారని.. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారంటూ.. సెంటిమెంట్ రాజేశారు. అప్పుడు పబ్లిక్ గా అన్నేసి మాటలు మాట్లాడి.. ఇప్పుడు మాత్రం సభలో సైలెంట్ గా ఆ మాటల మంటలపై అయింట్మెంట్ పూసినట్టు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు సైతం బండి సంజయే టార్గెట్ గా అటాక్ చేస్తున్నారు. కేటీఆర్ అయితే పదే పదే బండిపై మాటల బాంబులు విసురుతున్నారు. దీంతో.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోరు కాస్తా.. బండి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది. మిగతా నేతలతో డైలాగ్ వార్ నడుస్తున్నా.. కలిస్తే వారంతా మంచిగానే మాట్లాడుకుంటారు. బండి సంజయ్ మాత్రం ముఖం కూడా చూడరు. పలకరింపు కూడా ఉండదు.అందుకే, బండి సంజయ్ తోనే సమస్యంతా అన్నట్టుగా.. మిగతా బీజేపీ నేతలతో తమకేమీ ప్రాబ్లమ్ లేదన్నట్టుగా.. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో చిట్ చాట్ గా మాట్లాడారని అంటున్నారు. అయితే, ఈ ఎపిసోడ్ పరోక్షంగా ఈటలకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈటల రాజేందర్ పై ఓ వర్గం రకరకాల ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈటల, కేటీఆర్ లు కులాసాగా మాట్లాడుకోవడం.. బీజేపీలో ఆయన మరింత కార్నర్ అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇలా కావాలనే.. కేటీఆర్ మైండ్ గేమ్ ఆడారా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోంది. ఇంతకీ కేటీఆర్.. ఈటలతో ఎందుకు మాట్లాడినట్టు? ఏం మాట్లాడినట్టు?